https://oktelugu.com/

ABN RK: భయపెట్టడంలో మేమే ఫస్ట్ అంటున్న ఏబీఎన్ ఆర్కే

అడ్డంగా దొరికిపోయిన ఆ ఇద్దరు అధికారులు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూసి అఖిలభారత సర్వీస్ అధికారులు చర్చించుకుంటున్నారట. వారిద్దరిని దేవుడు కూడా కాపాడలేరు అంట.

Written By: , Updated On : November 28, 2023 / 01:02 PM IST
ABN RK

ABN RK

Follow us on

ABN RK: “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంటుంది” ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు. తాను నమ్మిందే నిజం. తానుచెప్పిందే వాస్తవం. అంటూ ప్రజల్లో ఒక రకమైన భ్రమలు కల్పించడంలో ఆర్కే ముందుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసినట్టు.. జగన్ అక్రమ నిర్ణయాలపై సమీక్షించినట్టు.. జగన్ సర్కార్కు సహకరించిన అధికారులందరూ బాధ్యులైనట్టు కలలు కంటున్నారు. వాటినే తన ఆంధ్రజ్యోతిలో అచ్చు వేస్తున్నారు.ఇది నమ్మండి నిజం అంటూ ప్రజలకు ఒక రకమైన సంకేతాలు పంపుతున్నారు.

అడ్డంగా దొరికిపోయిన ఆ ఇద్దరు అధికారులు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూసి అఖిలభారత సర్వీస్ అధికారులు చర్చించుకుంటున్నారట. వారిద్దరిని దేవుడు కూడా కాపాడలేరు అంట. ఇదే విషయమై ఏపీ అఖిలభారత సర్వీస్ అధికారుల సోషల్ మీడియా గ్రూపులో వైరల్ అవుతుందట. జగన్ సర్కార్ పై ఉన్న అక్కసుతో ఏబీఎన్ ఆర్కే ఇద్దరు ఐఏఎస్ అధికారుల పై పడ్డారు. వీరిలో ఒకరు ఎక్సైజ్ ఎండి వాసుదేవరెడ్డి. మరొకరు గనుల డైరెక్టర్ వెంకటరెడ్డి. వచ్చే టిడిపి ప్రభుత్వంలో ఈ ఇద్దరు అధికారులకు కష్టాలు తప్పవని ఆర్కే తేల్చేశారు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. కేంద్ర, ఇతర రాష్ట్రాల సర్వీసుల్లో ఉన్న అనేకమంది తెలుగు అధికారులు డిప్యూటేషన్ పై సొంత రాష్ట్రానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి రాష్ట్రానికి వచ్చారు. కీలక బాధ్యతలు చేపడుతున్నారు.

చంద్రబాబు అక్రమ కేసుల్లో వీరి పాత్ర ఉందంటూ ఆర్కే అనుమానిస్తున్నారు. మద్యం, ఇసుక కుంభకోణాల్లో చంద్రబాబుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీరు బాధ్యతలు తీసుకున్నాక ఆ రెండు శాఖల్లో అవినీతి పెరిగిందని.. దానిని మరుగున పరిచేందుకే చంద్రబాబుపై కేసులని ఆర్కే చెప్పుకొస్తున్నారు. చంద్రబాబుపై అవినీతి కేసులు ముమ్మాటికి రాజకీయ కక్షతోనే చేసినవి. అరెస్టు చేసిన స్థాయికి చంద్రబాబుపై అభియోగాలు మోపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దానికి ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులను బాధ్యులు చేస్తూ ఏబీఎన్ ఆర్కే హెచ్చరికలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.

ప్రభుత్వాలు మారితే అధికారులు బాధ్యులవుతారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్ పై సీబీఐ కేసులు నమోదయ్యాయి. అప్పట్లో అవినీతి కేసులను సిబిఐ జెడిగా ఉన్న లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. 16 నెలల పాటు జగన్ జైలు జీవితం అనుభవించారు. అయితే జెడి లక్ష్మీనారాయణ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి స్వేచ్ఛగా ఏపీలో తిరుగుతున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చాలామంది అధికారులు తప్పిదాలకు పాల్పడ్డారు. అలాగని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇబ్బంది పడ్డారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్, జేబీ వెంకటేశ్వరరావు వంటి వారు ఇబ్బంది పడినా.. న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందారు. ఈ విషయం ఆంధ్రజ్యోతి ఆర్కే కి తెలియనిదా? ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు భయపడిపోతున్నారంటూ కథనాలు రాయడం దేనికి సంకేతం? టిడిపి నేతలు వీరిపై గురి పెట్టారు అనడం సమంజసమేనా? అయితే ఆర్కే కు అన్ని విషయాలు తెలుసు. జగన్ అంటే పడదు.. అర్జంటుగా చంద్రబాబును అధికారంలోకి ఎక్కించాలి. అందుకే ఈ తరహా రాతలకు ఆయన వెనుకడుగు వేయరు.