Telangana Elections 2023: జనసేన పోటీచేసే చోట కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యమా?

వాస్తవానికి మొన్నటి దాకా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వర్సెస్ భారత రాష్ట్ర సమితి అనే విధంగా రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మారిపోయాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 28, 2023 12:57 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాల కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు. దేనికోసమైనా వెనకాడకుండా పనిచేస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇవే పరిణామాలు కనిపిస్తున్నాయి.. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే ఎందుకైనా మంచిది అనే ముందు జాగ్రత్తతో భారత రాష్ట్ర సమితి అనేక రకాల రాజకీయ ఎత్తులను వేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన పరిస్థితి వేరే విధంగా ఉంటుందని భావిస్తోంది. అయితే భారత రాష్ట్ర సమితి రాజకీయ చతురతను అలా ఉంచితే.. బిజెపి వేస్తున్న ప్లాన్ ఎన్నికల్లో మరో విధంగా ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాంగ్రెస్ పోటీ చేసే చోట..

వాస్తవానికి మొన్నటి దాకా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వర్సెస్ భారత రాష్ట్ర సమితి అనే విధంగా రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గతానికంటే భిన్నంగా ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నారు.. ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. కీలక నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.. అయితే సహజంగానే కాంగ్రెస్ పొడ గిట్టని బిజెపి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు రకరకాల ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను రంగంలోకి దింపింది. వాస్తవానికి ఇవి 8 స్థానాలే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆసలు పెంచుకున్న స్థానాల్లో ఇవి కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తన మిత్ర ధర్మంలో భాగంగా పోటీ చేయకుండా జనసేనకు కేటాయించింది. సాధారణంగా జనసేనకు చెప్పుకోదగిన స్థాయిలో బలం లేకపోయినప్పటికీ అక్కడ రకరకాల కారణాలతో ఆ పార్టీకి బిజెపి సీట్లు కేటాయించింది.

కుల సమీకరణాలు కూడా

జనసేనకి కేటాయించిన సీట్లల్లో చాలావరకు కుల సమీకరణలనే బిజెపి పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోటలోని బిజెపి జనసేనకు టికెట్లు కేటాయించింది.. దీనివల్ల ఆ ఓట్లు ఎంతో కొంత జనసేన అభ్యర్థులకు పడతాయని బిజెపి భావిస్తోంది. ఇలా ఓట్లు చీలడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయావకాశాలు దెబ్బతింటాయని బిజెపి నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.. ఇలా కనీసం కొన్ని సీట్లలో జరిగినా కాంగ్రెస్ దెబ్బతింటుందని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది అంతిమంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని వారు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామం భారత రాష్ట్ర సమితికి లాభం చేకూర్చినప్పటికీ బిజెపి నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే బిజెపి నాయకులు అంచనా వేసుకున్నట్టుగా ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది డిసెంబర్ 3న తేల నుంది.