Telangana Elections 2023: బీజేపీ ఇంత ఉధృతంగా ప్రచారం చేయడానికి కారణమేంటి?

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా జరుగుతున్న పోరాటానికి పరిష్కారం చూపడం ద్వారా తెలంగాణలో సుమారు 10 లక్షల ఓట్లు కొల్లగొట్ట వచ్చని కమలం నేతలు గుర్తించారు.

Written By: Raj Shekar, Updated On : November 28, 2023 1:04 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ తర్వాత బీజేపీ– బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన వ్యక్తమైంది. గులాబీ బాస్‌ కేసీఆర్‌ తన ప్రచారంలో కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేయడం, బీజేపీని పల్లెత్తు మాట కూడా అనకపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఇక బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై నోరు మెదపలేదు. లిక్కర్‌ కేసులో అందరూ అరెస్ట్‌ అయినా కేసీఆర్‌ తనయ కవిత అరెస్ట్‌ కాకపోవడం బీజేపీ–బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య మైత్రి ఉందన్న అనుమానాలను బలపర్చింది. కానీ, సడెన్‌గా ఏమైందో అర్థం కావడం లేదు. బీజేపీ–బీఆర్‌ఎస్‌ మధ్య సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రచారంతో మొదట మెతకవైకరి అవలంభించిన బీజేపీ చివరికి దూకుడు పెంచింది. గులాబీ బాస్‌ కూడా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఎక్కడ చెడిందా అని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.

బీసీ సీఎం నినాదం..
తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని అధిష్టానం ప్రకటించింది. హైదరాబాద్‌లో బీసీ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలూ మారిపోయాయి. పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన ప్రధాని మోదీ… మరో అస్త్రాని వెలికి తీశారు.

ఎస్సీ వర్గీకరణకు సుముఖం..
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా జరుగుతున్న పోరాటానికి పరిష్కారం చూపడం ద్వారా తెలంగాణలో సుమారు 10 లక్షల ఓట్లు కొల్లగొట్ట వచ్చని కమలం నేతలు గుర్తించారు. దీంతో ఎస్సీ వర్గీకరణకు సుముఖత వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా మాదిగ సామాజికవర్గాన్ని బీజేపీవైపు తిప్పుకున్నారు. హైదరాబాద్‌లో మాదిగల విశ్వరూప సభ ఏర్పాటు చేసి ఏకంగా ప్రధాని మోదీ హాజరు కావడం, వేదికపై ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణను హత్తుకుని ఓదార్చడం, మాదిగల సమస్యను అర్థం చేసుకున్నానని, పరిష్కారం నేనే చూపుతానని హామీ ఇవ్వడం ద్వారా మాదిగల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మూడు రోజుల తర్వాత మందకృష్ణ ప్రెస్‌మీట్‌ పెట్టి.. ఎన్నికల్లో బీజేపీకి ఎమ్మార్పీఎస్‌ మద్దతు ఇస్తుందని, మాదిగలంతా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణలో అతిపెద్ద సామాజికవర్గం బీజేపీవైపు మారిపోయింది.

బీసీ, ఎస్సీల బలంతో..
మారుతున్న ఓటర్ల వైఖరిని గుర్తించిన బీజేపీ.. అధికారంలోకి రాకపోయినా.. శాసించేస్థాయికి ఎదుగుతామని లెక్కలు వేసుకుంది. దీంతో ప్రచారంలో దూకుడు పెంచడం ద్వారా మరింత ఊపు వస్తుందని, కనీసం 20 నుంచి 30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని భావించింది. దీంతో బీజేపీ అధిష్టానం వెంటనే అగ్రనేతలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. అప్పటి వరకు చప్పగా సాగుతున్న బీజేపీ ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది. మేనిఫెస్టోలోని ధాన్యానికి మద్దతు ధర పెంపు, పెట్రోల్‌ ధరల తగ్గింపు, విద్యార్థినులకు ల్యాప్‌టాప్, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు వంటి కీలక అంశాలతో ఓటర్లను మరింత ఆకట్టుకుంది.

యోగి నుంచి మోదీ వరకు..
ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ సైన్యం రంగంలోకి దిగింది. యూపీ సీఎం యోగి, అసో సీఎం హేమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర సీఎం ఎక్‌నాథ్‌షిండేతోపాటు, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, పీఎం మోదీ వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కేవలం ఐదు రోజుల్లో సుడిగాలి ప్రచారంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం మార్చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఈరోజు నుంచి మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభలు, రోడ్‌షోలతో ఆకట్టుకున్నారు. మరో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అగ్రనేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు తెలంగాణ బీజేపీలో జోష్‌ పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ఈసారి తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు సుమారు పది సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో రోడ్‌షో చేశారు. ఓ టీవీ చానల్‌ నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు.

మొత్తంగా 20 సీట్లకుపైగా సాధించి శాసించేస్థాయిలో బీజేపీని నిలపడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ప్రచార వ్యూహంతో ఎన్నికల వాతావరణాన్ని మార్చేశారు. ఓటర్ల ఆలోచనను బీజేపీ వైపు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్‌ 3న చూడాలి.