Homeజాతీయ వార్తలుఆప్ విజయం ప్రతిపక్షాలకు దెబ్బనా?

ఆప్ విజయం ప్రతిపక్షాలకు దెబ్బనా?

ఆప్ డిల్లీ విజయంపై బిజెపి యేతర పక్షాలుచాలా సంతోషంగా వున్నాయి. వాటి సంతోషమల్లా బిజెపి ఓడిందని. మీడియా కూడా అదే వైఖరిని వెల్లబుచ్చాయి. ముందుగా ఒక్క విషయం మరిచిపోతున్నాము. డిల్లీ లో అధికారంలో వుంది బిజెపి కాదనేది. ఆప్ అధికారాన్ని నిలుపుకోవటమే కాకుండా చరిత్ర సృష్టించిందనేది అందరూ ఒప్పుకోనేవిషయం. అంతవరకూ బాగానేవున్నా మిగతా పక్షాల విషయంలో విశ్లేషణ సరిగ్గాలేదనే చెప్పాలి. బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు ఆప్ అనుసరించిన పేద , మహిళా అనుకూల విధానాలకే ఓటు వేసారు. ఇకపోతే మిగతా పార్టీలను చూస్తే అంతకుముందు మూడుసార్లు అధికారంలో వున్న కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవటం ఆ పార్టీ భవిష్యత్తును సూచిస్తుంది.

ఆప్ విజయాన్నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? ప్రజల మధ్యవుండి పనిచేస్తే ప్రజలు పార్టీలను ఆదరిస్తారని అర్ధమవుతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలదిశగా ఆప్ అడుగులువేయటం హర్షించదగ్గ పరిణామం. అరవింద్ కేజ్రివాల్ 2015 కి ఇప్పటికి ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా మారాడని పరిశీలకులు భావిస్తున్నారు. డిల్లీ లో తను చేసిన పనులే తనను గెలిపిస్తాయని నమ్మాడు. అలాగే సిఎఏ పై తనదైన శైలిలో ప్రతిస్పందించాడు. షహీన్ బాగ్ శిబిరాన్ని దర్శించకుండా జాగ్రత్తపడ్డాడు. అంటే బిజెపి గేమ్ ప్లాన్ లో పడకుండా జగ్రత్తపడ్డాడని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం పక్కదారిపట్టకుండా తన పనివిదానంపైనే తీర్పు చెప్పేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాడు.

మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, పార్టీలు ఆప్ విజయాన్నుంచి తీసుకోవాల్సిన గుణ పాఠాలేంటి? ముఖ్యంగా పేద ప్రజల్లో ఎప్పట్నుంచో పనిచేసిన చరిత్ర వున్న వామపక్షాలు ఏమి గుణపాఠాలు నేర్చుకోవాలి. చూడబోతే నేను ఓడినా పర్వాలేదు అవతలి వాడు మట్టికరిస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్న వామపక్షాలు ఆత్మపరిశోధన చేసుకోవాల్సిన అవసరం లేదా? తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల గుండెల్లో నిలిచిన చరిత్రగలిగిన ఈ పార్టీలు పూర్తిగా కనుమరుగై పోవటానికి కారణమేమిటి? డిల్లీ లో ఆప్ చేసిన పని ఈ పార్టీలు చేయలేకపోవటానికి కారణమేంటి? నేను ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు పార్టీ నిర్మాణ స్వరూపం సమూల మార్పులకు గురికావల్సివుంది. ఇంకా పాత కాలపు రహస్య పనివిధానాన్ని వదిలి పారదర్శకత , జవాబుదారీతనం కలిగిన నిర్మాణ వ్యవస్థని రూపొందించుకోవాలి. అతిముఖ్యమైనది శ్రామిక నియంతృత్వం అనే నిరంకుశ వ్యవస్థని ఆదర్శంగా తీసుకోకుండా ప్రజాస్వామ్య సోషలిజం ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటికీ భారత దేశంలో బిజెపి, మధ్యేవాద కాంగ్రెస్ లాంటి పార్టీలతో పాటు , వామపక్ష పార్టీలకు భవిష్యత్తు వుంది. కాకపోతే సిద్ధాంతం స్పష్టంగా ప్రజాస్వామ్య వైఖరి కలిగివుండాలి. ఆప్ దాదాపు ఈ వైఖరి తీసుకోబట్టే ప్రజలు ఆదరించారు.

ఓ విధంగా చెప్పాలంటే ఆప్ రావటం బిజెపి కన్నా కాంగ్రెస్, వామపక్ష సంప్రదాయ పార్టీలకు సవాలు. ఎందుకంటే ఈ ఎన్నిక తర్వాత ఆప్ మిగతా రాష్ట్రాల్లో వ్యాప్తి చెందటానికి మునపటికన్నా చురుకుగా పనిచేయటం ఖాయం. సంప్రదాయ కాంగ్రెస్, వామపక్ష ఓటర్లు ఆప్ వైపు మొగ్గే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేజరిగితే సమీప భవిష్యత్తులో ఈ రెండు వర్గాల ఓటర్లు ఆప్ వైపు మొగ్గటం  ఖాయం. ఈ లోపలే ఈ పార్టీలు ఆత్మపరిశోధన చేసుకొని మార్పులు  చేసుకోకపోతే ముందుగా నష్టపోయేది ఈ పార్టీలే. డిల్లీ లో జరిగింది ఇదే. కాంగ్రెస్ ఓటర్లు మొత్తం ఆప్ వైపు మొగ్గు చూపారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో భారత రాజకీయ పటంలో ఎన్నో మార్పులు జరిగే అవకాశముంది. బిజెపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి అవకాశాలు మృగ్యం. ప్రాంతీయ పార్టీలు జాతీయ ఎన్నికల్లో ఎప్పటికీ  బిజెపి కి ప్రత్యామ్నాయం కాలేవు. కాబట్టి ముందు ముందు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దాన్నిబట్టే 2024 ఎన్నికలని అంచనా వేయాల్సి వుంటుంది.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular