Gujarat Election Results 2022: ఒకటా.. రెండా.. రెండు దశాబ్దాలు అయింది.. వచ్చే ఐదేళ్లు కలిపితే 32 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని ఏండ్లు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై.. ఎన్నికలు జరిగిన ప్రతిసారి మెరుగైన ప్రదర్శిన చేస్తోంది. ఓటు బ్యాంకు పెంచుకుంటున్నది. సీట్లను కూడా పెంచుకుంటున్నది. 2017లో అధికారంలోకి వచ్చేదే. కానీ చీపురు పార్టీ కాంగ్రెస్ విజయావకాశాలను దారుణంగా దెబ్బ కొట్టింది.. ఈసారి కూడా గత ఎన్నికల ఫలితమే పునరావృతమైంది.. అప్పట్లో 78 స్థానాలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి 24 వద్దే ఆగిపోయింది. భారతీయ జనతా పార్టీ 150 స్థానాల్లో గెలుపొంది.. గుజరాత్ రాష్ట్రంలోనే కనివిని ఎరుగని రికార్డ్ సెట్ చేసింది. 50% ఓట్లు అధికార బిజెపికే దక్కాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2017లో ఇలా కాదు
2017 శాసనసభ ఎన్నికల్లో అధికార బిజెపికి కాంగ్రెస్ చుక్కలు చూపించింది. ఈసారి అధికారంలోకి రావడం కష్టమే అని బిజెపి నాయకులు కూడా అభిప్రాయానికి వచ్చారు. కానీ అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసింది.. ఏముంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పడేసింది. ఫలితంగా కాంగ్రెస్ 78 స్థానాల వద్ద ఆగిపోయింది. భారతీయ జనతా పార్టీ 99 స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో ఆప్ కనుక పోటీ చేయకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
27 ఏళ్లుగా అధికారంలో..
సాధారణంగా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే… మరుసటి ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత మూట కట్టుకోవడం సాధారణం.. కానీ 27 సంవత్సరాలుగా గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వరుసగా పాలిస్తోంది. వాస్తవానికి 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లతో 77 స్థానాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 49 శాతం ఓట్లు అంటే 99 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం మరింత పెరిగింది. గత ఏడాది కంటే నాలుగు శాతం పెరిగి 53 శాతానికి చేరింది. కాంగ్రెస్ ఓట్ శాతం 27 కు పడిపోయింది. ఆప్ 12 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో నిలిచింది.. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను కాంగ్రెస్ మూడింట రెండు వంతులు, ఆప్ ఒక వంతు పంచుకున్నట్టు అర్థమవుతున్నది.
చీపురు ఊడ్చుకొస్తోంది
ఆప్.. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని దెబ్బకొడుతూ వస్తోంది.. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసింది. తర్వాత పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలో ప్రతిపక్ష స్థానానికి చేరింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ అధికారాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో కూడా అదే పని చేసింది.. గుజరాత్ ఎన్నికలను త్రిభుక పోరుగా మార్చిన ఆప్… కాంగ్రెస్ పార్టీని మరోసారి కోలుకోలేని దెబ్బతీసింది. ఒకవేళ ఆప్ పోటీలో గనుక లేకుంటే మరోసారి కాంగ్రెస్ పార్టీ బిజెపికి గట్టి పోటీ ఇచ్చేదేమో. కానీ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షలకే కాదు… ఆశలకు గండి కొట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసింది.

ఎన్నో తప్పిదాలు
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి వెనుక ఎన్నో తప్పిదాలు ఉన్నాయి. ఒక దశలో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ చేస్తోందా? అనేంతగా ఆ పార్టీ నేతలు వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ తన మంది మార్బలాన్ని ప్రయోగించింది. ఆప్ తనకున్న పరిమిత వనరులను వినియోగించుకుంది. భారతీయ జనతా పార్టీకి తామే గట్టి పోటీదారు అని ప్రకటించుకుంది. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వాల్సి ఉండగా… తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి అని బిజెపి ప్రకటించింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రచార శైలిలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించలేదు. చివరి నిమిషంలో రాహుల్, మల్లిఖార్జున ఖర్గే పర్యటించి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. భారత్ జోడో యాత్రకు కొద్దిరోజుల ముందు గుజరాత్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. తర్వాత రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్కరోజు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని కొంతమేర దెబ్బ కొట్టాయి. మల్లికార్జున ఖర్గే చేసిన “పది తలల రావణాసురుడు” వంటి వ్యాఖ్యలు కూడా బిజెపి తనకు అనుకూలంగా మార్చుకుంది