Chittoor District: అంగన్వాడిలో దారుణం.. చిన్నారుల ఆహారంలో పాము కళేబరం

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జంబు వారి పల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో ఈనెల 4న పౌష్టికాహారం పంపిణీ చేశారు. గర్భిణీలకు ఎండు ఖర్జూరం ప్యాకెట్లను అందజేశారు.

Written By: Dharma, Updated On : October 11, 2023 12:41 pm
Follow us on

Chittoor District: ఏపీలో అంగన్వాడీ కేంద్రాలకు వైయస్సార్ సంపూర్ణ, సంపూర్ణ ప్లస్ కింద పౌష్టికాహారం అందిస్తున్న సంగతి తెలిసిందే.చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఇస్తున్న పౌష్టికాహారం మెనూ మరింత మెరుగుపరిచినట్లు ఆర్భాటంగా ప్రకటిస్తూ వస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పాలు, ఇతరత్రా పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పౌష్టికాహారంలో పాము కళేబరం కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జంబు వారి పల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో ఈనెల 4న పౌష్టికాహారం పంపిణీ చేశారు. గర్భిణీలకు ఎండు ఖర్జూరం ప్యాకెట్లను అందజేశారు. మానస అనే గర్భిణి తనకు ఇచ్చిన ప్యాకెట్ తీసుకొని వ్యాసన పల్లెలోని తన పుట్టింటికి వెళ్ళింది. ఖర్జూరం ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అంగన్వాడి సూపర్వైజర్ రెడ్డి కళ్యాణి ద్వారా సిడిపిఓ వాణి శ్రీదేవికి సమాచారం అందించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని సిడిపిఓ వాణిశ్రీదేవి తెలిపారు.

అయితే అంగన్వాడి కేంద్రాలకు ఇచ్చే పౌష్టికాహారంలో నాణ్యత లోపం పై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పాడైన పాల ప్యాకెట్లు, ఇతరత్రా ఆహార పదార్థాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తమ హయాంలోనే అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నట్లు చెబుతూ వస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇటువంటి లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.