Land Mafia: జనసేన సైనికులు ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల ఆక్రమణకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైసీపీ నేతల ఆగడాలపై జనసైనికులు గళం విప్పారు. సర్కారు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇంతటి నీచమైన పనులు చేయడానికి కూడా వెనకాడటం లేదంటే దాని పతనం మొదలైందని చెబుతున్నారు.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ అండదండలతో భూకబ్జాల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తమదే ప్రభుత్వం కావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. స్థలం కనబడితే చాలు ఆక్రమణలు యథేచ్ఛగా చేస్తున్నారు. అడిగే వాడు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. పరిస్థితి చేయిదాటి పోవడంతో ఇక చేసేది ఏమీ లేదని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి రావడంతో విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విశాఖలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భావించి వైసీపీ నేతలు ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. విషయం కాస్త జనసేన పార్టీ నేతలకు తెలియడంతో వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నగరంలోని దసపల్లా లే అవుట్ సర్వే నెంబర్లలో 1196, 1197, 1027, 1028లలో 60 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 40 ఎకరాలు జీవీఎంసీ, వుడా, తూర్పు నావికాదళం తీసుకోగా ఐదు ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని భావించింది.

ఇక్కడ 15 ఎకరాల భూమి కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకుంది. 2001లో సర్వే శాఖ దసపల్లా భూములను 22ఏలో చేర్చి జీవో 657 జారీ చేశారు. వీటిని కాజేయాలని కొందరు పన్నాగం పన్నారు. ఇప్పటికే పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్, ఎల్ ఎల్ పీ కంపెనీల పేరిట కాజేయాలని పథకం రచించారు. ఇక్కడ 15 అంతస్తుల భవనం నిర్మించాలని ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో చీకటి ఒప్పందాలు కుదరడంతో ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నట్లు వెలుగులోకి రావడంతో జనసేన సైనికులు స్పందించారు.
ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చౌక ధరలకు భూములను కొట్టేసి భారీ భవనాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తమదేననే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు భూమికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. జనసేన పార్టీ ఒత్తిడితో సర్కారు భూమికి రక్షణ కలుగుతుందని భావిస్తున్నారు. అక్రమంగా కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.