Moinabad Farm House Deal: అందరికీ బల్లి శకునం చెబుతుంది.. కానీ చివరికి తానే కుడితిలో పడుతుంది. ఇప్పుడు ఈ సామెత మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అడ్డంగా దొరికిపోయిన స్వామీజీలకు వర్తిస్తుంది. ప్రముఖులకు, బడా నేతల ఇంట్లో శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టడంలో దిట్టలుగా పేరొందిన ఇద్దరు స్వామీజీలు అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల తో ఆపరేషన్ ఆకర్ష డీల్ కుదుర్చుకునేందుకు కూడా ముహూర్తాన్ని సెట్ చేసినట్టు సమాచారం.. కానీ ఆ ముహూర్త బలం మధ్యలోనే బెడిసి కొట్టింది. వెరసి డీల్ కుదరలేదు సరి కదా.. పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు అయ్యారు.

అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బిజెపి మధ్య హోరాహోరి పోరు జరుగుతున్నది. పోటాపోటీ మాటలతో నాయకులు ఉప ఎన్నికను మరింత రంజుగా మార్చుతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఢిల్లీకి చెందిన కొందరు .. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం టిఆర్ఎస్ అధినాయకత్వం దృష్టికి వచ్చింది. దీంతో టిఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమై కొందరు ఎమ్మెల్యేలపై నిఘా కూడా పెట్టింది. ఎవరైనా బేరసారాలకు దిగినా, మరి ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నట్టు దృష్టికి వచ్చినా వెంటనే ఉప్పందించాలని సంకేతాలు ఇచ్చింది. ఏ సమయంలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి లకు రామచంద్ర భారతి, సింహ యాజి అనే స్వామీజీలు, నందకుమార్ అనే వ్యక్తి నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మీరు టిఆర్ఎస్ వీడి బిజెపిలోకి వస్తే ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తామని, ముందుగా 50 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు.

ఈ డబ్బుతో పాటు కేంద్రంలో ఉన్నత పదవులు కూడా ఇస్తామని ప్రలోభ పెట్టారు.. అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ఐదు రోజుల క్రితం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.. అప్రమత్తమైన కేసీఆర్ ఈ పనిని చేదించే బాధ్యత పోలీసులకు అప్పగించారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలను దీపావళికి ముందే కలవాలని ఆ స్వామీజీలు, నందకుమార్ అనుకున్నారు. అయితే వీరిని పట్టించే ఉద్దేశంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు దీపావళి తర్వాత కలుద్దామని చెప్పారు. అయితే మరుసటి రోజు గ్రహణం ఉందని, బుధవారం భేటీ అవుదామని చెప్పారు. ఈ విధంగా బుధవారం సాయంత్రం ఫామ్ హౌస్ కు వచ్చిన స్వామీజీలు, నందకుమార్ పోలీసులకు పట్టుబడ్డారు. అందరికీ ముహూర్తాలు చెప్పే స్వామీజీలు తాము ఎరక్క పై ఇరుక్కుపోయారు. ఈ కేసు ఎటు తేలుతుందో ఏమో గాని.. ఆ స్వామీజీల పై మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ఎమోజీలు ట్రెండ్ అవుతున్నాయి.