Jagan: ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల ముంగిట షాక్ తగిలింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. విచారణకు స్వీకరించింది. జగన్ తో పాటు సీబీఐకి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులను ప్రతివాదులుగా చేర్చింది. వారికి సైతం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారానికి విచారణను వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టులో విచారణ ఈరోజు జరిగింది. జగన్ గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని.. అధికారంలోకి వచ్చాక ఈ కేసులో సాక్షాలు చెరిపే ప్రయత్నం చేశారని.. అందుకే వెంటనే బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు తరుపు న్యాయవాది కోరారు. అయితే సాక్షాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో కేసు పూర్వాపరాలను, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరుపు న్యాయవాది కోర్టుకు అందించారు.
జగన్ కేసుల విషయంలో రఘురామకృష్ణంరాజు మొండి పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రఘురామకృష్ణంరాజు గెలుపొందారు. అయితే అక్కడ నుంచి ఆరు నెలలకే వైసీపీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు పై ఏపీ సిఐడి దూకుడుగా వ్యవహరించింది. ఒకసారి అదుపులోకి తీసుకుని తనపై దాడి చేసినట్లు రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. అయితే ఈ తరుణంలో ఆయన జగన్ అక్రమాస్తుల కేసులపై పడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇటీవలే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అక్రమాస్తుల కేసుల్లో సాక్షాలను చెరిపేస్తున్నారని సుప్రీంకోర్టులో జగన్ పై పిటిషన్ వేశారు.ఈ రెండు పిటిషన్లు విచారణకు రావడం విశేషం.
అక్రమస్తుల కేసులో బెయిల్ పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామన్ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాదు నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. అయితే ఎన్నికల ముంగిట ఈ కేసు విచారణకు వస్తే మాత్రం జగన్కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.