Nara Lokesh
Nara Lokesh : మేకపాటి కుటుంబం( mekapati family) తెలుగుదేశం పార్టీలో చేరనుందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని అసంతృప్తితో ఉందా? టిడిపిలో చేరడమే శ్రేయస్కరమని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా, ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా, కుమారుడు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే తో పాటు మంత్రిగా, మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. ఇలా చెప్పుకుంటూ పోతే మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ కుటుంబం జగన్ వెంట అడుగులు వేసింది. జగన్మోహన్ రెడ్డి సైతం వారికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా జరిగిన పరిణామాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. త్వరలో ఆ కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయంగా తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ
కాంగ్రెస్ పార్టీ( Congress Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. కానీ 1985లో మాత్రం ఉదయగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1996, 1998 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. 2004లో నరసరావుపేట ఎంపీగా గెలిచారు. 2009లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఐదు సార్లు ఎంపీగా విజయం సాధించడం విశేషం.
* వారసుడిగా గౌతమ్ రెడ్డి
రాజమోహన్ రెడ్డి( Raja Mohan Reddy ) రాజకీయ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019లో రెండోసారి గెలిచి జగన్ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. అయితే ఆయన అకాల మరణంతో తమ్ముడు విక్రం రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ గౌతమ్ రెడ్డి మంత్రి పదవి విక్రమ్ రెడ్డికి కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి. అటు తరువాత మేకపాటికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే ఈ ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు కుమారుడు విక్రమ్ రెడ్డి సైతం పోటీ చేశారు. ఇద్దరికీ ఓటమి తప్పలేదు. అయితే గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు వారికి ఇబ్బందికరంగా మారాయి. వారు పార్టీ మారుతారు అన్న ప్రచారం ఎక్కువగా నడుస్తోంది.
* ఓ వివాహ వేడుకల్లో కలయిక
ఇటీవల ఓ వివాహ వేడుకల్లో నారా లోకేష్( Nara Lokesh) ను కలుసుకున్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. రాజమోహన్ రెడ్డి ని చూసిన లోకేష్ నమస్కరిస్తూ ఆయన వద్దకు వెళ్లారు. అటు రాజమోహన్ రెడ్డి సైతం లోకేష్ ను చూసి లేచి నిలబడ్డారు. వెల్డన్ లోకేష్.. అనుకున్నది సాధించారు అంటూ అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటినుంచి మేకపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందని ప్రచారం ఎక్కువగా నడిచింది. అయితే మేకపాటి కుటుంబానికి అటువంటి ఆలోచన లేదని అనుచరులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే రెండు రోజుల కిందట రాజమోహన్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు కూడా చేశారు. దీంతో ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.