New Telugu Channel: తెలుగు ప్రేక్షకులకు శుభవార్త. తెలుగు నాట మరో ఎంటర్టైన్మెంట్ ఛానల్ రాబోతోంది. ఈనెల 24న ప్రారంభం కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఛానల్ ను ప్రారంభించనున్నారు.మహా న్యూస్ ఛానల్ నుంచి.. ప్రేక్షకులకు వినోదం పంచేందుకుగాను మహా మ్యాక్స్ పేరిట ఈ ఛానల్ గ్రాండ్ గా లాంచ్ కానుంది. గత కొన్నేళ్లుగా మహా న్యూస్ ఛానల్ తెలుగు నాట కొనసాగుతోంది. ఆ సంస్థ నుంచి పూర్తి ఎంటర్టైన్మెంట్ ఛానల్ రావడం విశేషం.
తెలుగులో న్యూస్ ఛానల్ అధికం. ఆ సంఖ్యతో పోల్చుకుంటే వినోద భరిత చానళ్లు చాలా తక్కువ. ప్రస్తుతం తెలుగులో ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు.. వాటికి అనుబంధంగా మ్యూజిక్, కామెడీ, భక్తి ఛానళ్లు కొనసాగుతున్నాయి. అయితే మహా న్యూస్ ఛానల్ నుంచి మరో ఎంటర్టైన్మెంట్ ఛానల్ రావడం శుభ పరిణామం.సాధారణంగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే వందలాది మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కొత్తగా బుల్లితెరపై రాణిస్తామనుకుంటున్న ఔత్సాహితులకు ఇదో అనువైన ప్లాట్ ఫామ్.
ఈనెల 24న హైదరాబాదులోని జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో ఈ ఛానల్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఉదయం 10:00 నుంచి గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ను మహా న్యూస్ యాజమాన్యం ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వాస్తవానికి పవన్ విదేశాలకు వెళ్లాల్సి ఉంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం యూరప్ లో జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో అక్కడ బిజీ బిజీగా ఉంది. ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు పవన్ తో పాటు కుటుంబ సభ్యులు వెళ్ళనున్నారు. మహా మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను ప్రారంభించిన తర్వాత.. పవన్ విదేశాలకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రోజే రాజమండ్రిలో టిడిపి, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీల సమావేశానికి పవన్ హాజరు కానున్నారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత పవన్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తానికైతే తెలుగులో ఒక వినోద భరిత టీవీ ఛానల్ అందుబాటులోకి రావడం శుభ పరిణామం. దానిని పవన్ ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణ.