Crime : దారికాచి లైంగిక దాడి చేశారు. మృగంలా రెచ్చిపోయారు. స్వతంత్ర భారత దేశంలో పగలు కూడ స్వేచ్చ లేదని నిరూపించారు. మాన ప్రాణాలకు భద్రత లేదని గుర్తు చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. కామంతో కళ్లు మూసుకుపోయి మానవత్వాన్ని మంటగలిపారు. హైదరాబాద్ నగరాన్ని ఉల్కిపడేలా చేశారు.
హైదరాబాద్ లో జరిగిన ఘటన సమాజం తలదించుకునే రీతిలో ఉంది. మహిళ పై ఇద్దరు యువకులు మృగత్వాన్ని ప్రదర్శించారు. పట్టపగలే అత్యాచారం చేశారు. వికారాబాద్ కు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడజాగీర్ పరిధిలోని పీరంచెరువులో నివాసం ఉంటున్నారు. భర్త కూలి పనులు చేస్తాడు. భార్య గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తుంది. ఆమె శుక్రవారం పని ముగించికుని ఇంటికి వస్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. పని ఇప్పిస్తానంటూ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేశాడు. ఆమె పనికి వెళ్తుండగా మరొక యువకుడితో కలిసి వెంటబడ్డారు. ఆమెకు పని ఇప్పిస్తామని మాట్లాడుతూ.. బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసిన యువకుల్లో ఒకరు కారు డ్రైవర్ శుభంశర్మ కాగా.. మరొకరు ప్రైవేటు ఉద్యోగి సుమిత్ కుమార్ శర్మగా పోలీసులు గుర్తించారు.
కారులో ఆమెను బలవంతంగా ఎక్కించారు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఆమెతో తాగించారు. వెంటనే ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. ఆమెను కార్లో తిప్పుతూ ఆ ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను శారీరకంగా హింసించారు. నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోయారు. గండిపేట సమీపంలో ఆమెను వదిలివెళ్లారు. మత్తు మందు ఇవ్వడంతో ఆమె చాలా సేపు తేరుకోలేదు. మత్తు నుంచి తేరుకోగానే భర్తకు, మేనమామకు ఫోన్ చేసింది. వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసులును ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సెల్ ఫోన్ నెంబర్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. నార్సింగి పోలీసులు నిందితుల్ని గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్, కారు స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరి పై గతంలో కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన పై మహిళా కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిందితుల్ని అరెస్టు చేసి.. శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సైబరాబాద్ కమీషనర్ ను, రంగారెడ్డి కలెక్టర్ ను మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మీరెడ్డి ఆదేశించారు. ఘటన పై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.