మనకు చదువు వద్దు, వైద్యం వద్దు, చదువుకుని, ఆరోగ్యంగా వుండే మనుషులు యుద్దం వద్దంటారు, యుద్దం లేకపోతే దేశభక్తి రాదు, దేశభక్తి లేకపోతే దాన్ని రెచ్చగొట్టి అధికారం పొందే అవకాశం రాదు. ఏ ఎన్నిక వచ్చినా యుద్దం జరగాల్సిందే, దాడులు సాగాల్సిందే!
కాబట్టే దాదాపు భారత్ లాంటి దేశమైన బ్రెజిల్ విద్య, వైద్యమ్మీద పెట్టే ఖర్చులో సగంకూడా పెట్టం. శత్రువనుకునే చైనా నుండైనా నేర్చుకోం. దారుణం ఏమంటే ఇదివరకున్న విద్య వైద్యాలని కూడా తుడిచిపెట్టేయాలని కంకణం కట్టుకోవడం.
ఒక సన్నాసి రాష్ట్రంలో పిల్లలకు గోధుమరొట్టెలోకి ఉప్పు పంచారు మధ్యాహ్న భోజనంలోకి. స్కూళ్లకేకాదు, యూనివర్సిటీలు, పరిశోధనలు, పరిశ్రమలు, వ్యాపారాలు భ్రష్టుపట్టించారు. చదువుకునే పుస్తకాల్లో పనికిరాని చెత్త కూరడం మొదలు పెట్టి ఇదివరకే చదుకున్న తలకాయల్లో తినే తిండినుండి, ధరించే దుస్తులదాకా విషం కూరారు.
జ్యోతిష్యం ఒక శాస్త్రం అయ్యింది. ఆయుర్వేదం డాక్టరేట్ అయ్యంది. ప్రఖ్యాత ఐఐఎంలలో సంస్కృతం బోధించడానికి శాఖలు ఏర్పాటయ్యాయి, పిల్లల పాఠ్యాంశాలు వారి భాష దాటకుండా రూపొందించడానికి ప్రత్యేక విధానం తీసుకొచ్చారు, సిలబస్‌లో హేతుబద్దత, సైంటిఫిక్ టెంపర్‌మెంటు స్థానంలో నమ్మకాలు, విశ్వాసాలు తీసుకురాబడ్డాయి. ఆవు అనే ఒక అద్భుత జంతువుని ఆవిష్కరించి, దానిమీద జాతీయ స్థాయిలో వ్యాసాలు రాయమని పోటీలు నిర్వహించడమైంది.
విద్యార్థులతో పాటు అత్యున్నత స్థాయి సైన్సు, సాంకేతిక, విద్యా, వైద్య రంగాల ప్రముఖులు తమలోని పైత్యాన్ని నిర్లజ్జగా బయటపెట్టేసుకునే ఈ క్షణాన్ని అస్సలు మిస్సవలేదు. ఆవు మూత్రం అమృతమంతే, ఆవుపేడలో సువర్ణం వుందంటే, ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక జంతువు ఆవేనని ప్రకటిచారు. సైన్స్ కాంగ్రెస్‌లు పురాణాల్లోని, కావ్యాల్లోని, వేదాల్లోని విమానాలూ, అణుబాంబులూ, టెస్ట్‌ట్యూబ్ గర్భధారణలు, నానో టెక్నాలజీలూ.. వెలికితీసి థీసీస్ సమర్పించడానికి వేదికలయ్యాయి.
ఇదే సమయంలో హేతుబద్దంగా, సెక్యులర్‌గా, నీతివంతంగా నిలబడిన వాళ్లని అయా పదవుల నుండి తప్పించి. వేధించి, హింసించి, జైళ్లలో పెట్టింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వ అనుచరగణం రెచ్చిపోయింది. ప్రశ్నించేవాళ్లని కమ్మీలనీ, విదేశీ సంతతని, దేశద్రోహులనీ, సంస్కార హీనులనీ, కిరస్తానీలనీ, జీహాదీలనీ బూతులు తిట్టారు. వెంటబడి హడలగొట్టారు.
సంప్రసాయం అంటూ తిన్నదరగక చేసే సర్కసుని వైద్యమని, దీన్ని మించిన వైద్యం మరెక్కడా లేదని నరాలు సాగదీసుకునే యోగానీ, శ్వాస బిగదీసుకునే ధ్యానాన్ని, ఎవరునవ్వుకున్నా బేపర్వా అనుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు పెట్టారు.
కొంపల్లో రోజూ తినే తిండి ఆయుర్వేదం అయ్యింది. తాగే పానీయాలు కషాయాలూ, పసర్లూ అయ్యాయి. ఈ దేశంలో ఒక సన్నాయి స్వదేశీ పేరుతో ప్రపంచం నివ్వెరపోయే పెద్ద పెట్టుబడిదారుడయ్యాడు. తినే గోధుమపిండినుండి, ధరించే జీన్స్ దుస్తులదాకా ఆయన తన పేరుమీదే అమ్మేయడంలో అతడి ప్రతిభ గాక ఈ దేశంలోని జనం అమాయకత్వం దాగివుంది.
పొద్దున్నే పళ్లు తోముకోవడానికే కాదు, చివరికి తిన్న పాత్రలు తోమే సబ్బుపొడిలోనూ నిమ్మకాయలూ, లవంగాలూ, పుదీనా వంటి దినుసులు వుంటేగానీ వాడలేని దుస్తితిలోకి నెట్టేయబడ్డాం!
తపేళాలూ, కంచాలూ మోగించి, దీపాలు వెలిగించి కరోనాని తరిమేశామని సిగ్గులేకుండా ప్రకటించుకుంటున్నాం గానీ, నిజానికి వచ్చిన వైరస్ బలహీన రకమో, వాతావరణ ప్రభావమో, కష్టించి పనిచేసే పనిచేసే జనమో, ప్రపంచంలో ఎక్కడాలేనట్టి వివిధరకాల జీవన పద్దతుల వళ్లో, వాటి జీన్స్ కలయికల వల్లో మొదటిదశ కోవిడ్ ప్రమాదాన్ని దాటగలిగాం.
ఇందులో పాలకుల పాత్ర ఏదైనా వుంటే అది కేరళ, ఆంధ్ర, తెలంగాణా వంటి పాలనా పద్దతులు పటిష్టంగా వున్న దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా అయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్గదర్శకానికి డిల్లీ ముఖ్యమంత్రిని కూడా కలిపి క్రెడిట్ ఇవ్వొచ్చు గానీ మరొకరికి కాదు. ఈ దేశ చరిత్రలో దేశ విభజన సమయంలోకూడా జరగని ఒక పెద్ద వలస అతి అమానవీయంగా, అతి నిర్దయగా సాగిన విషయం అమ్ముడుపోయిన, భయపడిన మీడియా పత్రికలు అప్పట్లో ప్రపంచానికి చూపలేదు గానీ ఈ కీర్తి అప్పుడే రావలసింది!
కేవలం అబద్దాలు ప్రచారం చేయడం ద్వారానే అధికారంలోకి వచ్చి, కొనసాగుతోన్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడే దీన్ని ఘనవిజయంగా ప్రచారం చేసుకుంది ప్రపంచం ముందు. దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రెండో కరోనా వేవ్‌కోసం ప్రపంచమంతా ఆసుపత్రులు, పరిశోధనలు, వైద్య పరికరాలు, మందులు, సర్వేలు సిద్దం చేసుకొంటోంటే మనం ఆక్సిజన్, వాక్సిన్ వాళ్లకు ఎగుమతి చేసి జబ్బలు చరుచుకుంటూ, ఇక్కడ కుంభమేళాలు, రాజకీయ ప్రత్యర్థుల్ని “దీదీ ఓ దీదీ” అంటూ జాతర తలపించే ఎన్నికల్లో పాటలు పాడుతూ తిరిగారు. దీనికి ఫలితం ఇప్పుడు ప్రపంచపు కరోనా కేసులన్నీ ఒక వైపు నిలబెడితే ఈ దేశపు కేసులు వాటికన్నా ఎక్కువై దేశపు కీర్తి ఆకాశాన్ని అంటింది.
ఇప్పుడు పక్కన చిన్నదేశాలైన భూటాన్, పాకిస్తాన్ దేశాలు తోచిన సాయం చేసి చేతులెత్తి ఈ దేశం బాగుపడాలని ప్రార్థిస్తున్నాయి. రష్యా, ఫ్రాన్స్ వంటి ఒకప్పటి మిత్రులేకాదు, అమెరికా, చైనా వంటి దేశాలూ వైద్యపరికరాలు అందించడానికి పోటీపడడమంటే అది ప్రజలకు, వారికి ప్రాతినిధ్యం వహించే దేశానికి అవమానం కాదు, కేవలం అది అధికారంలో కూర్చున్న పాలకులకు ఒక గుణపాఠం అంతే. అఫ్‌కోర్స్, మనం నేర్పాల్సిన గుణపాఠం ఇంకా మిగిలేవుంది!
-సిద్ధార్థి
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: A lesson for rulers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com