Chandrababu And KCR: నేల విడిచి సాము చేయకూడదు. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. మన బలానికి మించి ఆలోచన చేయకూడదు అన్నది దీని అర్థం. అలా చేయాల్సివస్తే ముందుగా మనం బలం పెంచుకోవాలన్నది అర్థం. తెలుగు నాట చంద్రబాబు, కెసిఆర్ లకు అచ్చుగుద్ధినట్లు సరిపోతుంది. ఈ ఇద్దరు నేతలు నేల విడిచి సాము చేసినవారే. తమ బలానికి మించి ఆలోచన చేసినవారే. అందుకే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇతర రాజకీయ పక్షాలపై ఆధారపడుతున్నారు.
ముందుగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ ను వ్యతిరేకించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించి మూల్యం చెల్లించుకున్నారు. సొంత రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయారు. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి, జనసేనలపై ఆధారపడ్డారు. ఈ పరిస్థితికి ముమ్మాటికీ చంద్రబాబే కారణం. జాతీయస్థాయిలో రాణించాలన్న ఆలోచన ఉన్నప్పుడు.. సొంత రాష్ట్రంలో అధికారాన్ని పదిలం చేసుకునే చర్యలు చేపట్టాలి. కానీ చంద్రబాబు అలా చేయలేదు. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు.
కల్వకుంట చంద్రశేఖర రావు పరిస్థితి కూడా అదే. ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ను వరుసుగా రెండుసార్లు గెలిపించడంలో ఆయన పాత్ర కీలకం. ఎప్పుడైతే జాతీయస్థాయిలో రాణించాలనుకున్నారో అప్పుడే స్థాన బలం కోల్పోయారు. సొంత రాష్ట్రంలో అధికారానికి దూరమయ్యారు. జాతీయ నాయకత్వం అంటే పక్క రాష్ట్రంలో ప్రాతినిధ్యం పెంచుకోవడమే. ఈ లెక్కన ఆయన ఏపీలో పోటీ చేసే ఛాన్స్ ఉందా? పోటీ చేసినా నెగ్గుకురాగలరా? ఆ పరిస్థితి ఉందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదనే చెప్పవచ్చు. ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో.. జాతీయస్థాయిలో ఏదో ఒక పార్టీకి, ఏదో కూటమి సాయం అందించాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఒడిశాలో నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ స్ట్రాంగ్ గా ఉండడం వల్లే వారికి జాతీయ పార్టీలు సరైన గౌరవం ఇవ్వాల్సి వస్తోంది. నవీన్ పట్నాయక్ దగ్గరకు బిజెపి వెళ్తోంది. మమతా బెనర్జీ దగ్గరకు కాంగ్రెస్ వెళ్తోంది. ఏరి కోరి సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఆ ఇద్దరూ సొంత రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉండటమే అందుకు కారణం. కానీ చంద్రబాబు ఏపీలో వీక్ గా ఉండడంతో బిజెపి దగ్గరకు వెళ్లి మోకరిల్లాల్సి వస్తోంది. అటు తెలంగాణలో కెసిఆర్ పార్టీ ప్రభ తగ్గిపోతుండడంతో కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరాల్సి వస్తోంది. వీటిని గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఆ ఇద్దరు నేతలపై ఉంది.