Ranthambore National Park Tiger: రాజస్థాన్‌లోని రణతాంబోర్ టైగర్ రిజర్వ్‌లో ఆరోహెడ్ (T–84) అనే పులి తన రాజసమైన జీవన యాత్రతో ప్రసిద్ధి చెందింది. జూన్ 19, 2025న, 14 ఏళ్ల వయస్సులో బోన్ క్యాన్సర్‌తో ఈ ధీరవనిత మరణించింది. ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు కారణంగా ‘ఆరోహెడ్’గా పిలువబడిన ఈ పులి, జోన్ 2, 3, 4 ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకుని, ప్రకృతి ప్రేమికులను, ఫొటోగ్రాఫర్లను ఆకర్షించింది.
చివరి క్షణాలు.. భావోద్వేగ దృశ్యం
ఆరోహెడ్ చివరి క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నేచర్ ఫొటోగ్రాఫర్ సచిన్ రాయ్ జూన్ 17న పదమ్ తలాబ్ వద్ద ఆమె చివరి నడకను వీడియోలో బంధించారు. ‘‘లెజెండరీ టైగ్రస్ ఆరోహెడ్ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. ధైర్యం, సహనం, పోరాటంతో నిండిన అరోహెడ్ జీవితం ఒక అధ్యాయం,’’ అని ఆయన భావోద్వేగంగా తెలిపారు. ఆరోహెడ్ తన కూనను మరో రిజర్వ్‌కు తరలించడం, బలహీన స్థితిలో కూడా చెట్టు కిందకు నడిచి శాశ్వత నిద్రలోకి జారుకోవడం పలువురిని కదిలించింది.
వారసత్వం..
ఆరోహెడ్ మాతామహి మచ్చీ (T–16), కృష్ణ (T–19) వారసురాలిగా రణతాంబోర్ అడవుల్లో తనదైన ముద్ర వేశాయి. మచ్చీ నీటి నుంచి మొసళ్లను బయటకు లాగి వేటాడే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందగా, ఆరోహెడ్ కూడా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ చివరి రోజుల్లో ఒక మొసలిని ఎదుర్కొని చంపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఆమె శక్తి, ధైర్యాన్ని మరోసారి నిరూపించింది.
ఆరోహెడ్ జీవన యాత్ర ప్రకృతి నియమాన్ని స్పష్టం చేస్తుంది. ఎంత గొప్ప జీవి అయినా, చివరి క్షణాల్లో సహజ సిద్ధమైన బలహీనతలను అనుభవిస్తుంది. ఆరోహెడ్ జీవితం ధైర్యం, సహనం, పోరాట గుణాలకు నిదర్శనం. అయితే, మరణం వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆరోగ్య రక్షణపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. రిజర్వ్ అధికారులు ఆరోహెడ్ వంటి పులులకు వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, వ్యాధులను ముందుగా గుర్తించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఇటువంటి జీవుల జీవనకాలాన్ని పొడిగించవచ్చు.
View this post on Instagram