JanaSena: జనసేనలో కీలక పరిణామం. పార్టీ కార్యవర్గాలతో పాటు అనుబంధ విభాగాల నియామకాలపై పవన్ ఫోకస్ పెంచారు. కీలక జిల్లాల అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ కమిటీలు ఏర్పాటయ్యాయి. త్వరలోనే అవి భేటీ కానున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కార్యవర్గాలను నియమిస్తుండడం విశేషం. జనసేన టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పవన్ పార్టీ శ్రేణులతో సమావేశాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈనెల ఐదున వారాహి నాలుగో విడత యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పార్టీ శ్రేణులతో సమీక్ష జరుపుతారని భావించారు. కానీ పవన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విశ్రాంతి తీసుకోవడంతో పార్టీ శ్రేణులతో సమీక్షలకు అంతరాయం కలిగింది. నిన్నటి నుంచి సమీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు కల్పించారు. కీలక జిల్లాలకు అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిల ప్రకటన ప్రారంభమైంది.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పడాల అరుణకు స్థానం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్ బాబును, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా పత్సమట్ల ధర్మరాజు, ఉండి నియోజకవర్గ ఇన్చార్జిగా జుత్తిగ నాగరాజు లను నియమిస్తూ మంగళవారం పవన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మరికొంత మందికి పదవులు కేటాయించారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీట్ల కేటాయింపులు, ఓట్ల బదలాయింపు పై ఈ కమిటీలు వ్యూహరచన చేయనున్నాయి. అందుకే 13 జిల్లాల అధ్యక్షుల నియామకంపై పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో మరింత మంది సీనియర్లకు చోటు కల్పించాలని పవన్ యోచిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి, మహిళా నేత పడాల అరుణను కమిటీ లోకి తీసుకున్నారు. విశాఖలో వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆమె జనసేనలో చేరారు. ఆమె సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావించి పీఏసీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకునే పార్టీ కార్యవర్గాల నియామకంపై కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు.