AP Politics: స్వప్నాల వెంట స్వర్గాల వేట.. తుదిలేని దోబూచులాట.. 90వ దశకంలో వచ్చిన దొంగాట సినిమాలో సూపర్ హీట్ పాట ఇది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సేమ్ సీన్ ఆవిష్కృతమైంది. అచ్చం ‘దొంగాట’ మాదిరిగా అన్ని రాజకీయ పక్షాలు చదరంగం ఆడుతున్నాయి. అయితే ఇందులో మేక ఎవరు? పులి ఎవరు? అన్నది తేలాల్సి ఉంది.ప్రస్తుతానికైతే సమర చదరంగం కొనసాగుతోంది. ఎత్తుకు పైఎత్తులతో కుయుక్తులు కొనసాగుతున్నాయి. చివరకు ఎవరు మిగులుతారన్నది వారి ఫెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది. అయితే పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆటను ఆడిస్తోంది. అ ఆటలో తానూ ఒక పాత్రధారిగా ఉంది. ఈ ఆట వెనుక ఇతివృత్తం మాత్రం 2024 అధికారంలోకి రావడమే. దీంతో తమ పాత్రల్లో నాయకులు లీనమైపోయారు. జనాలకు అందని రీతిలో తెగ నటిస్తున్నారు. ట్విస్టులతో వారిని మరింత గందరగోళంలో నెట్టేస్తున్నారు. పాత్రల నిడివి పెరుగుతుండడంతో సస్పెన్ష్ వీడడం లేదు.

2024 ఎన్నికలే అందరి టార్గెట్. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్. ఎలాగైనా జగన్ ను గద్దె దించి తాను ఎక్కాలని చంద్రబాబు.. వైసీపీ విముక్త ఏపీ కోసం పవన్..ఇలా ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. జగన్ సంక్షేమ తారకమంత్రంతో పాటు తన మానసపుత్రకలైన వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా వర్కవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజా వ్యతిరేకత చూస్తే తీవ్రంగా ఉంది. విపక్షాలు కలిస్తే దబిడదిబిడేనని ఆయనకు తెలుసు. అందుకే విపక్షాలు కలువకుండా చూడడానికి తనకున్న రాజకీయ పరపతిని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అటు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. వయసు చూస్తే ఏడు పదులు దాటింది. ఈసారి అధికారంలోకి రాకుంటే మామ నిర్మించిన పార్టీని ఇన్నాళ్లూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన తన కృషి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. అటు కుమారుడు లోకేష్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలన్న కోరిక తీరదు. అందుకే ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం రాజకీయంగా దూకుడు పెంచారు. ఈ ఎన్నికలు ఆయనకు కీలకం. గత ఫలితాలు పునరావృతమైతే మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవు. అందుకే గౌరవప్రదమైన స్థానాలు సాధించి ఏపీ పాలిటిక్స్ లో కీరోల్ పోషించాలన్న కసితో ప్రయత్నిస్తున్నారు.
అయితే ఏపీలో ఒక విశ్లేషణ కొనసాగుతోంది. టీడీపీ, జనసేనలు కలిస్తే అధికారం పక్కా. అదే విడివిడిగా పోటీచేస్తే జగన్ కు చాన్స్. బీజేపీ, జనసేనలు కలిస్తే టీడీపీకి దెబ్బ. వీటికి దగ్గరగానే రచ్చబండ నుంచి టీవీ చర్చల వరకూ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే విశ్లేషణలకు అందని ఏదో శక్తి ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిస్తోంది. చంద్రబాబుకు పవన్ చిక్కినట్టే చిక్కి జారిపోతున్నారు. అటు బీజేపీ అనుగ్రహిస్తున్నట్టే దూరం పాటిస్తోంది. అటు బీజేపీ మూడు పార్టీలకు సమదూరంతో పాటు స్నేహం పాటిస్తోంది. రాజకీయ పార్టీగా జగన్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర పెద్దలుగా మాత్రం జగన్ ను దగ్గర చేర్చుకుంటున్నారు. జగన్ అడుగుతున్న అవసరాలను తీర్చుతున్నారు. అటు అధికారికంగా పవన్ తన మిత్రుడని చెబుతున్నారు.. పవన్ కు పెద్దరికాన్ని కట్టబెట్టడం లేదు. తాను జగన్ పై పోరాడేందుకు రూట్ మ్యాప్ అడిగితే బీజేపీ ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. ఆ వెనువెంటనే ప్రధాని పవన్ ను పిలిపించి మరీ కలిశారు. అటు తరువాత సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులను ప్రధాని ఢిల్లీలో కలిశారు. ఇద్దిరితో మమేకమై మాట్లాడారు. ఇలా ఏపీ పాలిటిక్స్ లో ఎవరెవరితో ఉన్నారు? ఎవరితో ఎన్నికలకు కలిసి వెళతారు అన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఇప్పుడున్నపరిస్థితుల్లో ఏపీ పాలిటిక్స్ తో బీజేపీ చదరంగం ఆడుతోంది. తానూ పార్టిసిపేషన్ చేస్తోంది. అయితే అందరికి దగ్గరగా ఉంటోంది.. సమదూరం పాటిస్తోంది. పాత పగలను తీర్చుకుంటోంది. భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని మచ్చిక చేసుకుంటోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు తమను ఎంతలా డ్యామేజ్ చేసి ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా చేశారో కేంద్ర పెద్దలకు తెలుసు. అందుకే అదే స్థాయిలో టీడీపీని, చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు అదే చంద్రబాబు, టీడీపీతో తెలంగాణలో బీజేపీకి లాభించేలా ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. అటు పవన్ ను స్నేహితుడిగా కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ పగ్గాలు ఇచ్చేందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం లేదు. అటు జగన్ కు కేసుల బూచీని చూపిస్తున్నారు. పైగా జగన్ కు అప్పు కావాలి. దానికి కేంద్రం అనుమతివ్వాలి., రాష్ట్ర ప్రయోజనాలతో ఆయనకు పనిలేదు. ప్రత్యేక హోదా అడగడు. పోలవరం నిధులకు నిలదీయడు. పైగా 23 మంది ఎంపీల బలం ఆయనకు ఉంది. అందుకే కేంద్ర పెద్దలు కాస్తా కరుణిస్తున్నారు. ఇలా కేంద్రపెద్దలు ఏపీ పాలిటిక్స్ తో నాలుగు స్తంభాలాట ఆడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ సంకుల సమరానికి తుది రూపం రానుంది., ఫైనల్ గా కలబడి నిలబడే వారు విజేతగా నిలవనున్నారు.