Gudivada Amarnath: విశాఖ రాజకీయ యవనికపై గుడివాడ కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కాలం ఆ కుటుంబం విశాఖ రాజకీయాలను శాసించింది. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ వంశీయులకు పదవులు పూలపాన్పుగా రాలేదు. సామాజికవర్గ నేపథ్యంలో మిగతా వర్గాల ఆధిపత్యానికి తెరదించుతూ ముందుకు కదిలారు. కీలక పదవులు అందుకున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు గుడివాడ అమర్ నాథ్, తండ్రీ, తాతల వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన అమర్ నాథ్ గట్టి పోరాటమే చేశారు. సుదీర్ఘ కాలం రాజకీయంగా పోరాడారు. కిందపడుతూ, పైకిలేస్తూ రాజకీయాల్లో ఒడిదుడుకులు అలవాటు చేసుకున్నారు.

కీలక సమయాల్లో తప్పటడుగులు వేసి మంచి అవకాశాలను పోగొట్టుకున్నారు. చివరకు తాను కలలు కన్న అమాత్య పదవిని సొంతం చేసుకున్నారు. అమర్ నాథ్ తాత గుడివాడ అప్పన్న కాంగ్రెస్ (ఐ) తరపున 1978లో పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి గురునాథరావు 1989లో పెందుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించి నేదురమల్లి జనార్థన రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 1998 మధ్యంతర ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఎంపీ అయ్యారు. ఉత్తరాంధ్రలో బలమైన కాపు నేతగా ఎదిగారు. కాపులు అన్నిరంగాల్లో అభివ్రద్ధి చెందాలని ఆకాంక్షించారు. కానీ అకాల మరణం చెందారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్రను వేసుకున్నారు. ప్రత్యేకమైన నేతగా గుర్తింపు పొందారు.
Also Read: Drive On The Left: అమెరికాలో స్టీరింగ్ ఎడమ వైపుకు ఉండటానికి కారణాలేంటి?
రాజకీయ చిక్కుముళ్లు అధిగమిస్తూ..
గుడివాడ గురునాథరావు అకాల మరణం తరువాత ఆ కుటుంబం చుట్టూ రాజకీయ చిక్కుముళ్లు ఎదురయ్యాయి. అప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గుడివాడ కుటుంబం టీడీపీ పంచన చేరింది. 2004 ఎన్నికల్లో గురునాథరావు భార్య నాగమణి పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి చవిచూశారు. 2009లో పశ్చిమ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగి తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఈ సారి ఓటమి తప్పలేదు. అదే సమయంలో రాజకీయంగా ఓనామాలు దిద్దుకుంటున్న అమరనాథ్ 2007లో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లో మింది ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.

నగరపాలక సంస్థలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా గెలుపొందారు. 2011 వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ గూటికి చేరారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేశారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తండ్రి మరణించిన రెండు దశాబ్దాల తరువాత రాజకీయంగా అమర్ నాథ్ అమాత్య పదవి దక్కించుకున్నారు. దాదాపు గుడివాడ కుటుంబానికి రాజకీయ మార్గాలు మూసుకుపోయిన వేళలో 2019లో అనూహ్యంగా గెలుపొందడం.. తాజా విస్తరణలో అమర్ నాథ్ కు చోటు దక్కడంతో మళ్లీ యాక్టివ్ పొలిటిక్స్ లోకి గుడివాడ కుటుంబం అడుగు పెట్టిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:CM Kcr On Paddy: ధాన్యం దంగల్‌లో గెలిచి ఓడిన కేసీఆర్!