PM Modi: ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధాని నివాసం పైనుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ఫలితంగా ప్రధానమంత్రి భద్రత వ్యవహారాలు పరిశీలించే ఎస్పీజీ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. ఈ వార్త వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది.
ఢిల్లీలో ప్రధానమంత్రి అధికారిక నివాసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ప్రధానమంత్రి నివాస పరిసర ప్రాంతాలను భద్రతాధికారులు “నో ఫ్లయింగ్ జోన్ ” గా ప్రకటించారు. అంటే ఇక్కడ ఎటువంటి ఎగిరే వస్తువులను ప్రయోగించకూడదు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ నిబంధన అమల్లో ఉంది. గత ఏడాది పంజాబ్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెళ్లిన ప్రధానమంత్రిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డగించినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. దీంతో అప్పటినుంచి ప్రధానమంత్రి అధికారిక నివాస పరిసర ప్రాంతాల్లో భద్రత అధికారులు మరింత కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారస పడితే వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సోమవారం ప్రధానమంత్రి అధికారిక నివాసం మీద నుంచి డ్రోన్లు నాలుగైదు సార్లు చక్కర్లు కొట్టాయి. పైగా వాటి ద్వారా ఫోటోలు తీశారని భద్రత దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ఈ డ్రోన్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి భద్రతా అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ వ్యక్తులు వాటిని ప్రయోగించారు? అసలు వారి లక్ష్యం ఏమిటి? డ్రోన్లు కేవలం ఫోటోలు మాత్రమే తీశాయా? లేక ఇంకేమైనా లక్ష్యాల కోసం వాటిని ఉపయోగించారా? అనే కోణాల్లో భద్రత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. చైనా, పాకిస్తాన్ దేశాలతో భారత్ సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఏమైనా డ్రోన్లు ప్రయోగించారా అని భద్రత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇటీవల ఒక నిఘా బెలూన్ ను చైనా దేశం అమెరికా మీద ప్రయోగించిన నేపథ్యంలో.. ఆ దేశపు నిఘా సంస్థ ఏమైనా డ్రోన్ ప్రయోగించిందా అనే సందేహాలను కూడా నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా వీటికి సంబంధించిన దర్యాప్తును భద్రత అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.