69 Countries In Srilanka Way: ఏం కొనేట్టు లేదు. ఏం తినేట్టు లేదు. ధరల మీద మన్ను వడా నాగులో నాగన్నా.. పెరుగుతున్న నిత్యావసర ధరలపై 90 దశకంలో ఓ ఊపు ఊపిన పాట ఇది. అప్పటి 90వ దశకం పరిస్థితే ఇప్పుడూ పునరావృతం అవుతోంది. మొన్న శ్రీలంక, నిన్న పాకిస్తాన్, నేడు యూరో దేశాలు.. ప్రాంతాలే వేరు. ఎగిసి పడుతున్న ధరలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు దాదాపు అన్ని ఒకటే. అసలు ఇంతటి ధరల విస్ఫోటనానికి కారణం ఏంటి? ఇందులో ప్రభుత్వాల వైఫల్యం ఎంత? ప్రజల స్వయంకృతపరాధం ఎంత? ఈ సమస్యకు పరిష్కారం ఎన్నడు?
…
ఫిబ్రవరి ఆరో తేదీనే హెచ్చరించింది
…
కరోనా ప్రభావం, ఎగుమతులు, దిగుమతుల మధ్య అవరోధం వల్ల అభివృద్ధి చెందుతున్న 69 దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ప్రపంచ బ్యాంకుకు 1100 కోట్ల డాలర్లు బకాయి పడ్డాయి. ఇది వాటి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ప్రపంచ బ్యాంకు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తొమ్మిది రోజులకే రష్యా ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగింది. ఇక అప్పటినుంచి ఆయా దేశాల్లో ఇంధనం, ఆహార పదార్థాల కొరత తీవ్రమైంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం వల్ల 107 దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఆహారం, ఇంధనం, నిత్యావసరాలు అందక ఆయా దేశాల్లోని 170 కోట్ల జనాభా అంటే ప్రపంచ జనాభాలో ఐదో వంతు నరకం చూస్తున్నారు. కరోనా, ఉక్రెయిన్ రష్యా యుద్దం వల్ల ఏసియాలోని శ్రీలంక, పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో బాధపడుతున్నాయి. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ₹500 పలుకుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మొన్నటి దాకా ఇండియా పంపిన ఇంధనమే లంక కు దిక్కయింది. ఇక పాకిస్తాన్లో తాగే మంచినీళ్లు తప్ప అన్ని వస్తువులు అత్యంత ప్రియం అయిపోయాయి. జీలం – చీనాబ్ నదుల పరివాహక ప్రాంతాల్లో పండే పంటలు ఆ దేశంలో ఏ మూలకు సరిపోక ఆహారం కోసం ప్రజలు దొంగతనాలు చేస్తున్నారు. సరిగా మూడు దశాబ్దాల క్రితం లాటిన్ అమెరికాలో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంతకంతకు అడుగంటి పోవడంతో తమ దేశానికి బెయిల్ అవుట్ ప్రకటించాలని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ( ఐఎంఎఫ్)కు పాకిస్తాన్ ఇటీవల విన్నవించుకుంది.
…
ఈజిప్ట్ కుప్పకూలుతుందా?
…
ఆర్థిక మాంధ్యాన్ని ఎదుర్కొంటున్న 107 దేశాల్లో 69 దేశాలు ఆహారం, ఇంధనం వంటి కొరత తో ఇబ్బంది పడుతున్నాయి. వీటిల్లో 25 ఆఫ్రికా దేశాలు, 25 ఆసియా పసిఫిక్ దేశాలు, 19 లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. ఆర్థికంగా కుప్పకూలిన శ్రీలంక తర్వాత వరుసలో ఉన్నది ఈజిప్ట్. ఈ దేశం లోని ప్రజలకు ప్రధాన ఆహారం గోధుమలు. ఐదేళ్లుగా నైలు నది ప్రవాహం అంతకంతకు కుంచించుకుపోవడంతో గోధుమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ దేశానికి రష్యా, ఉక్రెయిన్ ప్రధాన గోధుమల ఎగుమతి దారులు. యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో ఆహార సంక్షోభం మొదలైంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు మూడు నెలలకే సరిపోతాయని ఆ దేశాధినేత చెబుతున్నారు. ఇక ఆ దేశాన్ని ఆహార సంక్షోభం చుట్టుముట్టడం ఖాయం. కరోనా వల్ల నిరుద్యోగం కూడా పెరగడంతో యువకులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈజిప్ట్ తర్వాత ట్యునిషి యాను కష్టాలు చుట్టుముట్టాయి. ఏడు శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తో నిత్యావసరాల ధరలు కనివిని ఎరగని స్థాయిలో పెరిగాయి. విదేశీ మారకద్రవ్య నిలువలలో 80 కోట్ల డాలర్ల లోటు నెలకొంది. ఫలితంగా ఇంధన ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఫలితంగా ఆ దేశంలోని ప్రజలు లంకేయుల్లాగా నిరసన బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఇక ఈ దేశం బాటలోనే లెబనాన్ పయనిస్తోంది. 2020లో బెరుడ్లో జరిగిన పేలుళ్ల వల్ల లెబానాన్ లో నిల్వ ఉన్న ధాన్యం పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ దేశంలో ఆహార ధాన్యాల ధరలు 11 రెట్లు పెరిగాయి. లెబనాన్ కరెన్సీ విలువ 90% పడిపోయింది. ఉక్రెయిన్ గోధుమలపై ఆధారపడిన ఈ దేశం.. యుద్ధం వల్ల ఎగుమతులు పోవడంతో ప్రజలకు ఆహార పదార్థాలు అందజేసేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి తక్షణ అవసరంగా 15 కోట్ల డాలర్లను రుణంగా తీసుకుంది. ఇక అర్జెంటీనా దేశం పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెచ్చిన రుణాలు కట్టలేక తొమ్మిది సార్లు చేతులు ఎత్తేసింది. ఇక పదోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి నాలుగు కోట్ల డాలర్ల అప్పు తీసుకుంది. ఎల్ సాల్వడార్, పెరూ దేశాలు కూడా అప్పులు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం తో విలవిలాడుతున్నాయి.
..
ఆఫ్రికా దేశాల్లోనూ..
..
దక్షిణాఫ్రికా, కెన్యా, ఘనా, ఇథియోపియా దేశాలు అప్పులతో విలవిలలాడుతున్నాయి. టర్కీ దేశం కూడా సంక్షోభం ఎదుట నిలిచింది. ద్రవ్యోల్బణం 70 శాతం పెరిగింది. 50 వేల టన్నుల గోధుమలను ఇటీవల భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నది. ఇవే కాక మరో 12 దేశాలు కూడా తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుట నిలిచాయని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇవేకాక ఆసియాలోని శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత మాయన్మార్, నేపాల్ దేశాలు కూడా ఆర్థిక సంక్షోభం ఎదుట నిలవబోతున్నాయని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
…
భారత దేశంలోనూ..
…
మనదేశంలోనూ నాలుగు రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు లోటు బడ్జెట్ తో సతమతమవుతున్నాయి. ఫలితంగా ఈ రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు ప్రజలపై ఎడాపెడా పన్నుల భారాన్ని మోపుతున్నాయి. పథకాల కోసం ఖర్చు చేస్తున్న నిధులను కూడా కాగ్ పరిధిలోకి రాకుండా పక్కదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉచిత పథకాల కోసం వెచ్చిస్తున్న నిధులు శ్రీలంక బడ్జెట్ కు సమానమని, ఆ పద్ధతులను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. అయినప్పటికీ ఆ రాష్ట్ర అధినేతల పనితీరులో ఏమాత్రం మార్పులేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారిమల నుంచి సొంత పథకాల కోసం వెచ్చిస్తుండటం వల్ల వాస్తవ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు లేక యువకులు ఇతర రాష్ట్రాల బాటపడుతున్నారు. దేశంలో అత్యధికంగా నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ నాలుగు ముందు వరుసలో ఉండడం గమనార్హం.
…
కొంపముంచుతున్న ఉచిత పథకాలు..
..
ప్రజాస్వామ్య దేశాల్లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం పార్టీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. బాగానే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు నెరవేస్తున్నాయి. సంక్షేమం పేరిట అమలు చేస్తున్న పథకాల వల్ల బడ్జెట్లో అభివృద్ధి పనులకు అంతకంతకు కోతపడుతున్నది. దీనివల్ల అప్పులు తేవడం ప్రభుత్వాలకు అనివార్యమవుతోంది. ప్రభుత్వ భూములు అమ్మటం, బాండ్లు విక్రయించడం ద్వారా ప్రభుత్వాలు అప్పులు తీసుకొస్తున్నాయి. దీనివల్ల ప్రజలపై పన్నుల భారం పడుతుంది. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. దేశంలోనే అత్యధికంగా చమురుపై ఆంధ్ర ప్రదేశ్ వ్యాట్ విధిస్తోంది. వివిధ పనులపై కూడా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తోంది. ఇంత చేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. దీనివల్ల ఎంచుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా అప్పులు అంతకంతకు పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోతాయి. లాటిన్ అమెరికా సంక్షోభం, వెనిజులా సంక్షోభం, 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి వాటి నుంచి పాలకులు పాఠాలు ఇప్పటికీ నేరవకపోతే భవిష్యత్తు తరాలు అసలు క్షమించవు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 69 countries in srilanka way
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com