తెల్లవారే సరికే వారి ప్రాణాలు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వేల కిలోమీటర్లు వలస వచ్చిన కూలీలు మంటల్లో కాలిబూడిదయ్యారు. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు రేకుల షెడ్డు మీద పడడంతో విగతజీవులయ్యారు. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవదహనమయ్యారు. రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన వ్యక్తులు కాపలాకు కుదిరారు. గురువారం అంతా రొయ్యల చెరువు వద్ద ఉన్న రేకుల షెడ్లులో నిద్ర పోయారు. వారు గాఢ నిద్రలోకి జారుకున్నాక కరెంటు తీగలు రేకుల షెడ్డు మీద పడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు ఏంటో ఇంతవరకు తెలియరాలేదు.
అయితే ఘటనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుదాఘాతం అని పోలీసులు చెబుతున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. విద్యుత్ సిబ్బంది మాత్రం అది షార్ట్ సర్క్యూట్ కారణం కాదని చెబుతున్నారు. మరి వారి మృతికి కారణాలేంటి అనే కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘటనా స్థలానికి మీడియాను ఎందుకు అనుమతించడం లేదు. రేకుల షెడ్డులో రసాయనాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అసలు వారు నిద్రించే గదిలో అవి ఎందుకు ఉన్నాయనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తోంది.
రసాయనాల పేలుడుతోనే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. దీనిపై రూరల్ ఎస్పీ విశాల్ గన్నీ, బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అయితే బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలోనే కూలీలు ఎందుకు నిద్రించారని ప్రధానంగా ప్రశ్న వస్తోంది. బ్లీచింగ్ వాసనకు వారికి నిద్ర ఎలా పట్టిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్కడ ఆరు గదులుండగా అందరు ఒకే గదిలో ఎందుకు నిద్ర పోయారు? మగవాళ్లు లోపల పడుకుంటే ఆడవాళ్లు బయట ఎందుకు పడుకున్నారు? గదులకు తలుపులు లేకపోయినా వారు ఎందుకు బయటకు రాలేకపోయారు? అది విద్యుదాఘాతమా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు సాగించాల్సిన అవసరం ఉంది.