
రాష్ట్రంలో కరోనా దోచుబులాట ఆడుతోంది. కరోనా అదుపులో ఉందని అనుకున్నంత లోపే పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గత మూడురోజులుగా కరోనా కేసులను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. మంగళవారం రాష్ట్రంలో 52కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆ సంఖ్య ఆరుకు పడిపోవడంతో కొంత ఊరట కలిగింది. అయితే తిరిగి గురువారం 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నేడు కొత్తగా 50కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 90శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైనట్లు తెలిపారు. గురువారం ఎలాంటి మరణాలు జరుగలేదని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 68మందిని డిశ్చార్జ్ చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా తెలంగాణలో 700కరోనా కేసులు నమోదుగా ప్రస్తుతం రాష్ట్రంలో 496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితోనే తెలంగాణలో కేసులు సంఖ్య పెరుగుతుంది. సూర్యాపేటలో కరోనా విజృంభిస్తుంది. ఇవాళ ఒక్క రోజే ఈ జిల్లాలో 16కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబంలో 14మందికి కరోనా సోకినట్లు సమాచారం. దీంతో జిల్లాలో మొత్తం 39కి కేసులు చేరాయి. ఇందులో సూర్యాపేట పట్టణంలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంది.