
దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. లాక్డౌన్ కారణంగా ఓ వైపు ప్రజలు ఇళ్లకే పరిమితమైన సమయంలో ఢిల్లీలో భూకంపం రావడం ఆందోళన కలిగింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సుమారు 3నుంచి 4సెకన్లపాటు భూప్రకంనలు వచ్చినట్లు తూర్పు ఢిల్లీలోని భూకంప కేంద్రం గుర్తించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లో 3నుంచి 4సెకన్లపాటు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది.
ఇదిలా ఉండగా ఢిల్లీలో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. అదేవిధంగా ఆదివారం ఢిల్లీలో వాయికాలుష్యం ఒక గీతపెరిగి ‘మితమైన(మోడరేట్)’ కేటగిరిలో నిలిచింది. అయితే గతవారం ఢిల్లీలో లాక్డౌన్ కారణంగా వాయికాలుష్యం తగ్గి ‘గుడ్ కేటరిగి’లోకి వచ్చింది. అయితే ప్రధాని మోదీ కరోనా చీకట్లను తొలగించాలని ఏప్రిల్ 5న పిలుపునివ్వగా కొందరు దీపాలకు బదులుగా కాకర్స్ కాల్చారు. దీంతో వాయికాలుష్యం పెరిగినట్లు తెలుస్తోంది.
కాగా భూకంపం వల్ల ఢిల్లీలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలను భూకంపం రోడ్లపై పడేయడం శోచనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు.