తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్‌.. కేసీఆర్‌‌ వ్యూహం ఏంటి..?

సీఎం కేసీఆర్‌‌ నోట మరోసారి వేతన సవరణపై కీలక మాటలు వచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) అమల్లో ఉందని, తెలంగాణలో దానికన్నా రెండు శాతం అధికంగానే ఫిట్‌మెంట్‌ (వేతన సవరణ) అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వేతన సవరణ కమిషన్‌ సిఫారసుతో సంబంధం లేకుండానే ఫిట్‌మెంట్‌ ఉండనుందని సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్‌‌ తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల […]

Written By: Srinivas, Updated On : March 10, 2021 11:23 am
Follow us on


సీఎం కేసీఆర్‌‌ నోట మరోసారి వేతన సవరణపై కీలక మాటలు వచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) అమల్లో ఉందని, తెలంగాణలో దానికన్నా రెండు శాతం అధికంగానే ఫిట్‌మెంట్‌ (వేతన సవరణ) అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వేతన సవరణ కమిషన్‌ సిఫారసుతో సంబంధం లేకుండానే ఫిట్‌మెంట్‌ ఉండనుందని సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్‌‌ తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్‌ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Also Read: ప్రత్యేక హోదా ప్రస్తావన తేవద్దు.. ఏపీకి కేంద్రం అల్టీమేటం

ఉద్యోగ, ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కోసం కమిషన్‌ సిఫారసు చేసింది. దీనిపై సంఘాలన్నీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. గతేడాది డిసెంబరులోనే వేతన సవరణ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి అందించగా.. ఆ తర్వాత తొలిసారిగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నిరాశను నింపిందని, ఏపీలో మధ్యంతర భృతి 27 శాతం ఇస్తున్నారని, దానికన్నా ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఉండాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరాయి.

దాంతో.. ఏపీ ఐఆర్‌ కంటే 2 శాతం ఎక్కువే ఇస్తానని, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం మండలి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నిర్ణయాలు బయటికి చెప్పలేనని సీఎం గుర్తు చేశారని అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. సమావేశంలో మామిళ్ల రాజేందర్‌, రాయికంటి ప్రతాప్‌ (టీఎన్జీవోల సంఘం), మమత, సత్యనారాయణ (టీజీవోల సంఘం), పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు (పీఆర్‌టీయూ), నరేందర్‌రావు(తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం) పాల్గొన్నారు. అంశాల వారీగా సీఎం కేసీఆర్‌‌తో జరిగిన చర్చల సారాంశాన్ని సంఘాలు వెల్లడించాయి.

Also Read: టీడీపీ, జనసేన ఇంటర్నల్‌ అండర్‌‌స్టాండింగ్‌

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈనెల 19న వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటానని సీఎం గుర్తు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరు వేరు అంటూ ప్రచారం జరుగుతోందని, తమను వేర్వేరు చేయకూడదని సంఘాలు కోరగా.. వయో పరిమితి పెంపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కలిసే ఉంటుందని సీఎం సంకేతాలు ఇచ్చారు. ఈ పెంపు కూడా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) తరహాలోనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) అమలు చేస్తామని, ఇందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. అంతకు ముందు ఈహెచ్‌ఎస్‌ సమస్యలను సంఘాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. కార్డు ఉన్నా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని తెలిపాయి. ప్రతినెలా ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల నుంచి కొత్త మొత్తాన్ని ఆరోగ్య పథకం కోసం వినియోగించాలని, ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, సీజీహెచ్‌ఎస్‌ లాగే ఈహెచ్‌ఎస్‌ అమలు చేయాలని సూచించాయి.

సీపీఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కుటుంబ పింఛనుతోపాటు పదవీ విరమణ సమయంలో తగిన ప్రయోజనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. దీనిపై పీఆర్సీ కూడా సిఫారసు చేసిందని గుర్తు చేశారు. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పిస్తామని సీఎం తెలిపారు. ఏపీలో 1,218 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వారిని తెలంగాణకు రప్పించడానికి వీలుగా త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని వివరించారు. సీఎం కేసీఆర్‌‌ ఉద్యోగుల పట్ల ఒక్కసారిగా ఇంత ప్రేమ కురిపించడం ఏంటా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయనే నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా..? లేక ఉద్యోగులకు నిజంగానే ఫిట్‌మెంట్‌ వరం ఇవ్వనున్నారా..? ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్