2020.. కలలు.. కన్నీళ్లు

మరికొద్ది గంటల్లో కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోతోంది. రేపటితో కొత్త దశాబద్దం ప్రారంభం కాబోతోంది. ఎన్నో కలలు.. మరెన్నో ఆశలతో మ్యాజిక్‌ ఫిగర్‌‌ 2020కి ఘన స్వాగతం చెప్పారంతా. తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని సంబురపడ్డారు. కానీ.. ఈ సంవత్సరం ప్రపంచాన్ని మొత్తం ఆడేసుకుంది. ఒక్క కోవిడ్‌తో ఆగమాగం చేసింది. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకూ కోవిడ్‌ నామ సంవత్సరంగా మిగిలిపోయింది. ఆ కోవిడ్‌ కారణంగా ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకుల వణికిపోయాయి. ఎంతో ఆనందంగా కొత్త […]

Written By: Srinivas, Updated On : December 31, 2020 10:45 am
Follow us on


మరికొద్ది గంటల్లో కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోతోంది. రేపటితో కొత్త దశాబద్దం ప్రారంభం కాబోతోంది. ఎన్నో కలలు.. మరెన్నో ఆశలతో మ్యాజిక్‌ ఫిగర్‌‌ 2020కి ఘన స్వాగతం చెప్పారంతా. తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని సంబురపడ్డారు. కానీ.. ఈ సంవత్సరం ప్రపంచాన్ని మొత్తం ఆడేసుకుంది. ఒక్క కోవిడ్‌తో ఆగమాగం చేసింది. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకూ కోవిడ్‌ నామ సంవత్సరంగా మిగిలిపోయింది. ఆ కోవిడ్‌ కారణంగా ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకుల వణికిపోయాయి. ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పిన ప్రజలంతా.. మూడు నెలలు గడువగానే ‘వీ హేట్‌ 2020’ అంటూ నినదించారు. ఈ ఇయర్‌‌లో జరిగిన అనూహ్య పరిణామాలు.. వ్యవస్థల తీరు.. ఏయే రంగాలు ఎలా ఇబ్బందులు పడ్డాయి..? ఎవరు హీరోలయ్యారు.. అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం.

Also Read:  రైతంటే భూమి ఉన్నోడా.. పంట పండించేటోడా?

ఫ్రంట్‌ వారియర్స్
ఈ ఏడాది వైద్యులు, వైద్యసిబ్బంది హీరోలుగా నిలిచారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ వైరస్‌ సోకిన వారందరికీ చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి గజగజ వణికిపోతుంటే.. వీరు మాత్రం ధైర్యంగా వైరస్‌ సోకిన వారికి అండగా నిలిచారు. కొంత మంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అదే వైరస్‌కు బలయ్యారు కూడా. ఈ ఏడాది ఏ ఆస్పత్రిలో అయినా కరోనా ట్రీట్‌మెంట్‌ తప్ప.. వేరే వ్యాధులకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ పెద్దగా చేయలేదు.

యుద్ధవీరులు
బార్డర్‌‌లో మిల్ట్రీ సైన్యం యుద్ధవీరులుగా నిలుస్తుంటే.. ఈ ఏడాది రాష్ట్రాల్లోని పోలీసులు సైతం యుద్ధవీరులయ్యారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక ఎవరూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వైరస్‌ నియంత్రణలో, లాక్‌డౌన్‌ అమలులో పోలీసు శాఖ పోషించిన పాత్ర ప్రశంసనీయం. ఈ యజ్ఞంలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. వైరస్‌ వారిని బలితీసుకుంది.

స్కూళ్లు క్లోజ్‌
ఈ ఏడాది కరోనా కారణంగా ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై పెద్ద ఎత్తున పడింది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపింది. 2020 మార్చి 16 నుంచి విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఇంటర్‌‌, పదో తరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ పాస్‌ చేసేశారు. ఇప్పటికీ ఇంకా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనేలేదు. ఇంకోవైపు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించినా.. అవి పెద్దగా ఫాయిదానివ్వడంలేదు. మరోవైపు మార్చిలో ఇంటిబాట పట్టిన గురుకులాల విద్యార్థులు ఇంతవరకూ గురుకులాల వైపు చూడలేదు.

ప్రాజెక్టుల పనులకు బ్రేక్‌
నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నుంచి పనులు పుంజుకునే సమయంలోనే వైరస్‌ అటాక్‌ చేయడంతో విదేశాల నుంచి రావాల్సిన సామగ్రి నిలిచిపోయింది. వలస కూలీలు సైతం స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ కారణాలతో పలు ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి.

ఇడిసిపెడితే.. వెళ్లిపోతాం..
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌ అందరికన్నా ఎక్కువ బాధలు అనుభవించింది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. దీంతో ఉపాధి లేక పూటగడవడం వారికి కష్టంగా మారింది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు స్తంభించడంతో దిక్కు తోచని స్థితిలో లక్షలాది మంది వలస కూలీలు మైళ్ల దూరం నడిచే వెళ్లారు. కాలినడకన వెళ్తున్న ఫొటోలు కన్నీళ్లు పెట్టించాయి.

Also Read: రైతు చట్టాలు.. ఆయుష్మాన్ భారత్.. మోడీకి కేసీఆర్ సాగిలపడ్డాడా?

వెలవెలబోయిన పర్యాటకం
తొమ్మిది నెలలుగా పర్యాటక ప్రాంతాలు పూర్తిగా బోసిపోయాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు కరోనా పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. మార్చి చివరి నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేశారు. జూన్‌లో హోటళ్లు, ఆగస్టులో మిగితా తెరిచినా ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇప్పటికీ పర్యాటక ప్రాంతాలకు పెద్దగా వెళ్లడంలేదు.

గిర్రుమని తిరిగిన విద్యుత్‌ మీటర్లు
కరోనా కష్టకాలంలో జూన్‌ నెల విద్యుత్‌ బిల్లులు అనూహ్యంగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 22 నుంచి దాదాపు రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించారు. లాక్‌డౌన్‌తో స్పాట్‌ మీటర్‌‌ రీడింగ్‌ తీయలేకపోయారు. లాక్‌డౌన్‌ సడలించడంతో జూన్‌లో 3 నెలల రీడింగ్‌ ఒకేసారి తీశారు. సగటు వినియోగం ఆధారంగా వేశారు. దీంతో టారీఫ్‌ శ్లాబులు మారిపోయాయి. బిల్లులు భారీగా పెరిగిపోయాయి.

ఐటీ కాస్త మెరుగు
పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాలు ఈ ఏడాది ఒడిదొడుకులకు లోనైనా పెట్టుబడులను రప్పించడం.. ఉపాధి కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించాయి. అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. కాగా.. ఐటీ సంస్థలన్నీ మార్చి నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని మరింత విస్తృతం చేశాయి. దీంతో ఇంటి నుంచే వర్క్‌ చేశారు. మరోవైపు.. కొత్త నియామకాలు నిలిచిపోవడం.. స్టార్టప్‌ కంపెనీలకు నిధుల కొరత, అద్దెల తగ్గింపు, ఐటీ కంపెనీలపై ఆధారపడి పనిచేసే హౌస్‌ కీపింగ్‌, కేటరింగ్‌ విభాగాల్లో పనిచేసే వారి ఉపాధికి మాత్రం గండిపడింది.

ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం
కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఛిన్నా భిన్నం అయింది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఇండియాలో సైతం అలాంటి పరిస్థితులే వచ్చాయి. ఇక రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇప్పుడిప్పుడే ఆయా దేశాల ఖజానా కొంతకొంత నిండుతున్నట్లుగా తెలుస్తోంది.

మా..మా… మాస్క్‌
ఈ ఏడాది విపత్కర పరిస్థితుల్లోనూ మాస్క్‌లు మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఫార్మాస్యూటికల్‌ రంగంలో ఆశించిన మేర ఎగుమవుతులు గణనీయంగా వృద్ధి చెందడం మంచి పరిణామం. మాస్క్‌ల ఎగుమతులు మెరుగుపడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. 110 దేశాలకు ఇండియా నుంచి డైరీ ప్రాడక్టులను ఎగుమతి చేశారు. కార్పెట్లు ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్‌, హెల్త్‌, వెల్‌నెస్‌, దుస్తులు తదితర ఎగుమతులు భారీగా పెరిగాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Tags