Batukamma :బతుకమ్మ.. ఇది పూల పండగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రకృతి పండగ. తెలంగాణలోని ఆడపడుచులందరూ ఎంతో భక్తితో కొలిచే పవిత్రమైన పండగ. ఈ పండగ కేవలం తెలంగాణ మాత్రమే కనిపిస్తుంది. ఇలా ప్రకృతితో మమేకమై, పండగ నిర్వహించుకునే సంప్రదాయం కేవలం తెలంగాణ సంస్కృతిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పండగకు చాలా విశిష్టత ఉంది.

ప్రత్యేక రాష్ట్రంలో.. ప్రత్యేక గుర్తింపు..
తెలంగాణ సంస్కృతిలో ఎన్నో ఏళ్ల నుంచి భాగంగా ఉంది బతుకమ్మ. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ పండగకు చెప్పుకోదగ్గ గౌరవం దక్కలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన వెంటనే బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా తెలంగాణ మహిళలకు బతుకమ్మ చీరలను సారె రూపంలో అందజేస్తూ వస్తోంది. బతుకమ్మ దగ్గర పాడే పాటలకు కూడా చాలా విశిష్టత ఉంది. పల్లెల్లో ఉండే కష్ట, సుఖాలను పాటల రూపంలో వ్యక్తపరుస్తారు. మెట్టినింటికి వెళ్లిన ఆడపిల్ల.. ఆడపడుచు ఈ పండగ సమయంలో ఇంటికి వచ్చి సందడి చేస్తుంది.
ఎక్కడైనా తొమ్మిది రోజుల బతుకమ్మే..
సాధారణంగా తెలంగాణ ఎక్కడైనా 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండు రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజుల సాగి, సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
ఆదిలాబాద్‌లో 20 రోజుల బతుకమ్మ ప్రత్యేకం..
తెలంగాణలోని అన్ని జిల్లాలో సాధారణంగా 9 రోజుల పాటే బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు. కానీ ఆదిలాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల మాత్రం 20 రోజల పాటు బతుకమ్మను కొలుస్తారు. ఇది ఈ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకం. అమావాస్య అయిన మరుసటి రోజు అంటే దసరా నవరాత్రులు మొదలయ్యే రోజు బతుకమ్మ తవ్వి పూజలు ప్రారంభిస్తారు. ఇక అక్కడి నుంచి ప్రతీ రోజు సాయంత్రం బతుకమ్మ గద్దెలను పూలతో అలంకరిస్తారు. రాత్రి పూట పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలాడుతారు. దసరా రోజు చిన్న సద్దులు అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు కూడా నిమజ్జనం రోజు చేసినట్టే మహిళలందరూ పట్టువస్త్రాలు ధరించి సంబరాలు నిర్వహిస్తారు. తెలంగాణ సంప్రదాయంలో భాగంగా దసరా రోజు తీసుకొచ్చే ’బంగారం’ ను బతుకమ్మకు సమర్పిస్తారు. అనంతరం పౌర్ణమి రోజు ‘కోజగిరి పున్నం’ను నిర్వహిస్తారు. ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి, చంద్రుడు నడినెత్తి మీదకు వచ్చేంత వరకు బతుకమ్మ దగ్గరే ఉంటారు. ఆ గిన్నెలో పోసిన పాలలో చంద్రుడు కనిపించేంత వరకు మహిళలందరూ అక్కడే ఉండి పాటలు పాడి, ఆటలాడుతారు. అనంతరం 20వ రోజు పెద్ద సద్దుల బతుకమ్మ పండగ నిర్వహించి బతుకమ్మ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇలా 20 రోజుల పాటు ఏ ప్రాంతంలో కనిపించని బతుకమ్మ, కేవలం ఆదిలాబాద్ సంస్కృతిలోనే కనిపిస్తుంది.