సాధారణంగా ఏదైనా ఓ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో పుట్టిన పిల్లకు అదే పేర్లు పెట్టడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం సమయంలో పుట్టిన పిల్లలకు తెలంగాణ అని, సమైక్య ఆంధ్ర ఉద్యమం సమయంలో పుట్టినవారికి సమైక్య అని.. పేర్లు పెట్టడం విన్నాం.. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోన్న కరోనాను కూడా విడవలేదు.. ఆ తర్వాత లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఆ లాక్ డౌన్ ను కూడా మనోళ్లు.. పుట్టిన పిల్లలకు పేరుగా పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలో మార్చి 30వ తేదీన ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టారు. ‘అతడు లాక్ డౌన్ సమయంలో పుట్టాడు అందుకే మా బాబుకు ఆ పేరు పెట్టాం అని చెబుతున్నారు ఆ బాలుడి పేరెంట్స్. మరోవైపు మార్చి 22న గోరఖ్‌పూర్‌లో ఓ ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ చిన్నారికి ఆ ‘కరోనా’ అని పేరు పెట్టినట్టు ఆ బాలిక మేనమామ నీతిష్ త్రిపాఠీ తెలిపారు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు నితీష్. మొత్తానికి ఏ సీజన్ లో ఆ పేర్లు పెట్టడం మనవాళ్లకు అలవాటు. స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇది కొనసాగుతూనే ఉన్నట్టు మన పెద్దల పేర్లు చుస్తే ఇట్టే అర్థం అవుతోంది.