
ఆమెకు 19 సంవత్సరాలు.. ఆయనకు 67 సంవత్సరాలు ఉన్నాయంటే.. వాళ్ల బంధం సాధారణంగా తాత, మనవరాలు మాదిరిగా ఉంటుంది. కానీ.. వీళ్లిద్దరూ భార్యాభర్తలు అయ్యారు! అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు!! ఇది నమ్మశక్యంగా ఉందా? కానీ.. ఇదే జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతోపాటు అనుమానం కూడా వ్యక్తం చేశారు. డబ్బుకోసమో.. మరో కారణంతోనో అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసి ఉంటారని అనుకున్నారు.
అయితే.. వీళ్ల పెళ్లిని రెండు కుటుంబాలు కూడా వ్యతిరేకించడం ఇక్కడ విశేషం. 67 ఏళ్ల ముసలి వాడితో పెళ్లి ఏంటని అమ్మాయి కుటుంబం గొడవ పెట్టింది. కాటికి కాళ్లు చాపే వయసులో 19 ఏళ్ల అమ్మాయితో పెళ్లి ఏంటని అతని పిల్లలు అభ్యంతరం చెప్పారు. దీంతో.. ఈ జంట ఏకంగా కోర్టును ఆశ్రయించింది. తమ ప్రేమ పెళ్లిని అడ్డుకుంటున్నారని, తమకు రక్షణ కల్పించాలని పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
కోర్టు కూడా వీరి వివాహాన్ని ప్రత్యేకంగా పరిగణించింది. అమ్మాయిని భయపెట్టి, లేదా వేరే అవసరం కోసం పెళ్లి చేస్తున్నారా? అని అనుమానించింది. దీంతో.. ఆ యువతి ప్రేమ పెళ్లిపై పూర్తి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీరిద్దరిది హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరధిలో ఉండే హంచ్ పూరీ గ్రామం. అక్కడికి వేళ్లి వివరాలు సేకరించారు. ఆ తర్వాత సదరు యువతితో స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని అందరూ విస్తుబోయారు.
‘‘ఈ పెళ్లికి నన్ను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు. నా అంతట నేనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆయనతో పెళ్లి పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఆయనకు గతంలో పెళ్లయ్యిందని నాకు తెలుసు. ఏడుగురు పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. వాళ్లంతా ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. నాకు కూడా గతంలో పెళ్లయ్యింది. భర్తతో విడిపోయాను. ఆయనకు కూడా ఈ పెళ్లిపై అభ్యంతరం లేదు. ఈ పెళ్లి విషయంలో ఎవరూ నన్ను బెదిరించలేదు’’ అని జిల్లా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది.
దీంతో.. అందరూ షాకయ్యారు. తనకన్నా దాదాపు యాభై సంవత్సరాల పెద్దవాడైన వ్యక్తిని ఈ యువతి ఎలా పెళ్లి చేసుకుందని అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయితే.. కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.