https://oktelugu.com/

Singareni: సింగరేణి కార్మికులకు రూ. 1,726 కోట్ల ఏరియర్‌.. ఒక్కో కార్మికుడికి ఎంతొస్తుందో తెలుసా?

వేతన బకాయిలు చెల్లింపు కోసం కార్మిక సంఘాలు క్రమం తప్పకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వేజ్‌బోర్డు వేతన బకాయిలు ఈనెల 21న చెల్లిస్తామని సింగరేణి ప్రకటించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 13, 2023 / 05:29 PM IST

    Singareni

    Follow us on

    Singareni: కార్మికులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వేతన బకాయిల చెల్లింపునకు సింగరేణి ఎట్టకేలకు ముందుకు వచ్చింది. బకాయిల చెల్లింపుపై కీలక ప్రకటన చేసింది. జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం సింగరేణిలోనూ అమలవుతోంది. పదో వేజ్‌బోర్డు కాలపరిమితి 2021, జూలై 1తో ముగిసింది. అప్పటి నుంచి 11వ బోర్డు అమల్లోకి వచ్చింది. 11వ వేతన ఒప్పందం ఈ ఏడాది మే 23న జరిగింది. అయితే 2021 జూలై నుంచి దీనిని అమలు చేయాల్సి ఉన్నందున పాత బకాయిలు సింగరేణి చెల్లించాల్సి ఉంది. ఈ 22 బకాయిలను ఈనెల 21న చెల్లించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది.

    కార్మిక సంఘాల ఒత్తిడితో..
    వేతన బకాయిలు చెల్లింపు కోసం కార్మిక సంఘాలు క్రమం తప్పకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వేజ్‌బోర్డు వేతన బకాయిలు ఈనెల 21న చెల్లిస్తామని సింగరేణి ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో పని చేస్తున్న 42 వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ బకాయిల మొత్తం జమచేస్తారు. ఇందుకు సంస్థ రూ.1,720 కోట్లు కేటాయించింది.

    కనిష్టంగా రూ.2.60 లక్షలు
    సింగరేణిలో ప్రారంభ వేతనం పదో వేజ్‌బోర్డులో రూ. 25 వేలు ఉండగా 11వ వేజ్‌బోర్డ్‌లో ఇది రూ.37 వేలకు చేరుకుంది. సీనియర్‌ విభాగంలో గరిష్ట వేతనం రూ.76 వేల నుంచి రూ.90 వేలకు పైగా చేరుకుంది. దీంతో ఒక్కో కార్మికుడు పొందే వేతనాల బకాయిల మొత్తం కనిష్టంగా రూ.2.64 లక్షలు ఉండగా, గరిష్టంగా రూ.3.08 లక్షల వరకు ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయంలో గరిష్టంగా రూ.6 లక్షల వరకు వేతన బకాయిలు అందనున్నాయి.

    ఎన్నికల నేపథ్యంలోనే..
    ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నామయి. మరోవైపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో కార్మికులకు చెల్లించాల్సి బకాయిలు పెండింగ్‌లో ఉంటే ఆ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని అధికార బీఆర్‌ఎస్‌ భావించింది. ఈ నేపథ్యంలోనే కార్మికులకు ముందుగా వేతన బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

    వచ్చే నెలలో లాభాల్లో వాటా..
    ఇదిలా ఉండగా సింగరేణి సంస్థ 2022–23 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించాల్సి ఉంది. ఏటా దసరా పండుగ సమయంలో ఈ వాటా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా అక్టోబర్‌లో లాభాల్లో వాటా చెల్లింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు సీఎం కేసీఆర్‌ జూలైలోనే ప్రకటన చేశారు. లాభాల్లో వాటా రూపంలో కూడా కార్మికులకు కనీసం రూ.40 వేలకుపైగా అందనున్నాయి.