Kendriya Vidyalayas: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన 2014లో జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ఏపీలో 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కొత్తగా పది జిల్లాలు ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలాకాలంగా కేంద్రాని కోరుతున్నారు. ఇటు బీఆర్ఎస్, అటు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కేంద్రం ఎట్టకేలకు విద్యాలయాలు మంజూరు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన డిసెంబర్ 6న(శుక్రవారం) సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 28 విద్యాలయాలు మంజూరు చేసింది. వీటిలో 15 తెలుగు రాష్ట్రాలకే కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్‌కు 8 కేంద్రీయ విద్యాలయాలు..
తాజాగా కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి, చిత్తూరులోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకే కేంద్రం ఆమోదం తెలిపింది.
తెలంగాణకు ఏడు నదోవయ విద్యాలయాలు..
ఇక తెలంగాణకు కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసింది. జిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలో వీటిని ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
రూ.5.87 వేల కోట్లు..
కొత్తగా ఏర్పాటు చేయనున్న 82 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలకు కేంద్రం భారీగా బడ్జెట్ కేటాయించనుంది. మరోవైపు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని విస్తరించేందుకు రూ.5.87 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. కొత్త పాఠశాలలతో దేశంలో 82 వేల మందికి నాణ్యమైన విద్య అందుతుంది. ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో దేశం వెలుపల రష్యా రాజధాని మాస్కోలో, నేపాల్ రాజధాని ఖాట్మండులో, ఇరాన్ రాజధాని టెహ్రాన్తోలో విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 13.56 లక్షల మంది చదువుకుంటున్నారు.