Karnataka: కర్ణాటక పరువు బజారున పడింది. దేశాన్ని నిర్మించే పాఠశాలల్లో అవినీతిపై ఆ స్కూల్ యాజమాన్యాలు పోరుబాట్టాయి. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై రాష్ట్రంలోని 13,000 పాఠశాలలు ప్రధానమంత్రికి లేఖ రాయడం పెను సంచలనమైంది.

బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ 13,000 పాఠశాలల తరపున రెండు సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి.
విద్యా సంస్థలకు గుర్తింపు ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి రాష్ట్ర విద్యా శాఖ లంచాలు డిమాండ్ చేస్తోందని వారు ఆరోపించారు. “అశాస్త్రీయ, అహేతుకమైన, వివక్షాపూరితమైన, పాటించని నిబంధనలు అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలల్లో భారీ అవినీతికి దారితీస్తున్నాయని’ లేఖలో పేర్కొన్నారు.
-లేఖలో ఏమి రాశారంటే?
ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ మరియు రిజిస్టర్డ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాసిన లేఖలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బిసి నగేష్‌కు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా.. విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, అవినీతి పెచ్చరిల్లుతోందని.. నగేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“ఇద్దరు వేర్వేరు బిజెపి మంత్రులు అక్షరాలా పాఠశాలలకు చాలా నష్టం కలిగించారు, ఎక్కువ మంది పెట్టుబడిదారులను స్థాపించడానికి అనుమతించడం ద్వారా విద్యను వాణిజ్యీకరించారు. పాఠశాలలకు వచ్చే తల్లిదండ్రుల నుంచి నేరుగా ఎక్కువ ఫీజులు వసూలు చేశారని’ లేఖలో ఆరోపించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ పాఠశాలలకు చేరలేదని వారు తెలిపారు. ఆరోపణలను పరిశీలించి, ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించాలని లేఖలో ప్రధానమంత్రిని కోరారు.
ఒక రాష్ట్రంలోని పాఠశాలలన్నీ కలిసి ఏకంగా ప్రభుత్వంపై, సీఎంపై ప్రధాని మోడీకి లేఖ రాయడం పెను సంచలనమైంది. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మసకబారేలా చేసింది. ఇప్పటికే సీఎం బొమ్మైపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆరోపణలు దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.