
Ambedkar Statue Unveiling: కెసిఆర్, రాజకీయం.. ఈ రెండింటిని వేరువేరుగా చూడలేం. ఆర్కే పరిభాషలో చెప్పాలంటే “కెసిఆర్ తన అవసరం ఉంటే ఎక్కడి దాకయినా వెళ్తాడు. ఎవరినైనా ఆలింగనం చేసుకుంటాడు. తనకు నచ్చకుంటే ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడు. అసలు ఎవరినీ పట్టించుకోడు. తన అవసరాల ఆధారంగానే ఆయన చేతలు ఉంటాయి. మాటలు ఉంటాయి. కెసిఆర్ ఒక మాట మాట్లాడాడు అంటే దాని వెనుక ఏదో పరామర్ధం దాగే ఉంటుంది.” ఇక ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కెసిఆర్ ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యాడు. బుద్ధ సంప్రదాయం ప్రకారం కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనల మధ్య అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమంలోనూ కెసిఆర్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించాడు. మహారాష్ట్రలో, అటు గుజరాత్ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి తర్వాత పనులను మధ్యలోనే నిలిపివేశారని గుర్తు చేశాడు. మరి తెలంగాణలో కూడా 2016 లో శంకుస్థాపన చేసిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు 2023లోనే పూర్తయింది. దాని గురించి కెసిఆర్ కానీ అటు ఆ నమస్తే తెలంగాణ కానీ ఒక్క మాట మాట్లాడదు. ఇదే విషయాన్ని టాకిల్ చేసే దమ్ము ఆ బిజెపికి లేదు.. సెంట్రల్ లోనే లిక్కర్ స్కాం విచారణ ఏ తీరుగా నడుస్తుందో చూస్తున్నాం కదా.. ఇక స్టేట్ లో అంతకంటే భిన్నంగా ఏముంటుంది? అసలు బిజెపి లోనే కెసిఆర్ కోవర్టులు ఉన్నారని చర్చ జరుగుతున్నది.

ఇక అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కెసిఆర్ తనదైన రాజకీయ ప్రసంగం చేశారు. అధికార బీజేపీని మరొకసారి తూర్పారబట్టారు. తనను తాను అభినవ అంబేద్కర్ గా అభివర్ణించుకున్నారు. తాను ప్రవేశపెట్టిన దళిత బంధు గేమ్ చేంజెర్ అని వెల్లడించారు. గతంలో ఉన్న పథకాలను ఏ విధంగా బొంద పెట్టింది మాత్రం చెప్పలేదు.. అసలు దళిత బంధు పేరుతో ఎస్సీలకు సంబంధించిన ఇతర సంక్షేమ పథకాలు ఏ విధంగా కాలగర్భంలో కలిపేశారో వివరించలేదు. బిజెపి మతం మత్తులో జోగుతోందని, తాను వారి ఆటలు సాగనివ్వబోనని కెసిఆర్ ప్రకటించారు. గతంలోనూ ఇవే మాటలు మాట్లాడారు. దేశం మొత్తం గాయి గత్తర చేస్తానని ప్రతిజ్ఞలు చేశారు. తాను ఇప్పుడేమో కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి మద్దతు పలుకుతున్నారు. ఎప్పుడు జరుగుతాయో తెలియని మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు.. చివరికి అంత ఎత్తున ఎగిరి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ హోదా కూడా దక్కించుకోలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని కవర్ చేసేందుకు కేసీఆర్ ఏదో ఒక ఎత్తుగడ తెరపైకి తీసుకొస్తారు.
తాజాగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా అలాంటిదే. ఎందుకంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఓట్ల శాతం ఎక్కువ.. ఇలాంటి అప్పుడు అధికారులకు రావాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. కాబట్టి కెసిఆర్ ఈ ప్రయత్నానికి పూనుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళితులపై ఆయనకు ప్రేమ ఉంటే సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ లాంటి ఓ దళిత మహిళ లాకప్ డెత్ కు ఎందుకు గురవుతుందని ప్రశ్నిస్తున్నాయి..
ఇక వచ్చిన అతిథులు కూడా కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన అభినవ అంబేద్కర్ గా చరిత్రలో నిలిచిపోతారని జూలూరు గౌరీశంకర్ లాంటివారు అభిప్రాయపడ్డారు. ఇక బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్ వంటి వారి భజనకైతే లెక్కాపత్రం లేదు. అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ ను వదిలిపెట్టి కెసిఆర్ భజనలో ఆరి తెరిపోయారు.. ఇక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. నరేంద్ర మోదీ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. మొత్తానికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా తన రాజకీయ కార్యక్రమంగా మార్చుకున్న కేసీఆర్ పై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.