Hathras Stampede: మాటలకందని దుఃఖం.. ఊహకందని బాధ.. హత్రాస్ నుంచి కుంభమేళా వరకు ఎన్నో విషాదాలు..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో.. 2023 మార్చి 31న శ్రీరామనవమి సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఆలయం స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 36 మంది కన్నుమూశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 3, 2024 9:17 am

Hathras Stampede

Follow us on

Hathras Stampede: దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ ప్రాంతంలో సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాట కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 116 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మన దేశంలో ఈ తరహా దారుణాలు గతంలోనూ జరిగాయి. మహారాష్ట్రలోని మందరా దేవి ఆలయంలో 2005లో జరిగిన తొక్కిసలాట కారణంగా 348 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలోని చాముండా దేవి ఆలయంలో 2008లో జరిగిన తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనా దేవి ఆలయంలో 2008 సంవత్సరంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. ఈ తరహా విషాదాలు ఇంకా చాలా చోటు చేసుకున్నాయి.. ఒకసారి వాటిని పరిశీలిస్తే..

మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో.. 2023 మార్చి 31న శ్రీరామనవమి సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఆలయం స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 36 మంది కన్నుమూశారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని వైష్ణో దేవి ఆలయంలో..

ఇండియన్ స్విట్జర్లాండ్ గా పేరుపొందిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మాతా వైష్ణో దేవి ఆలయంలో 2022 జనవరి 1న భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో..

ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 2017 జూలై 14న గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది కన్నుమూశారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో..

బీహార్లోని పాట్నాలో 2014 అక్టోబర్ 3 దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన సంబరాలలో తొక్కిసలాట జరిగింది. గాంధీ మైదాన్ లో జరిగిన ఈ సంఘటనలో 32 మంది చనిపోయారు. 26 మంది గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం రతన్ దేవాలయం సమీపంలో..

మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో 2013 అక్టోబర్ 13న రతన్ దేవాలయం సమీపంలో నవరాత్రి వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. వందమంది గాయపడ్డారు.

బీహార్ లోని గంగానది ఒడ్డున..

బీహార్ లోని పాట్నాలో 2012 నవంబర్ 19న గంగానది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద చాట్ పూజలు నిర్వహిస్తుండగా, అక్కడ నిర్మించిన తాత్కాలిక వంతెన కూలిపోయి తొక్కిసలాట జరిగింది. దాదాపు 20 మంది చనిపోయారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హరిద్వార్ లో..

ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ లో 2011 నవంబర్ 8న గంగా నది ఒడ్డున ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది కన్నుమూశారు.

కేరళ రాష్ట్రంలోని పూలమేడులో..

కేరళలోని ఇడుక్కి జిల్లాలో పూలమేడు వద్ద 2011 జనవరి 14న శబరిమల ఆలయాన్ని దర్శించుకుని వస్తున్న క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 14 మంది భక్తులు మృతిచెందారు. 40 మంది గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో..

ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ జిల్లాలోని కృపా మహారాజ్ రామ్ జానకి ఆలయంలో 2010 మార్చి 4న జరిగిన తొక్కిసలాటలో 63 మంది చనిపోయారు.

రాజస్థాన్ లోని జోద్ పూర్ ప్రాంతంలో..

రాజస్థాన్ లోని జోద్ పూర్ ప్రాంతంలోని చాముండా దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న బాంబు పేలుడు వదంతులు వినిపించడంతో.. తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 250 మంది కన్నుమూశారు. 60 మంది గాయపడ్డారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనా దేవి ఆలయంలో..

ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని విలాస్ పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో 2008 ఆగస్టు 3న కొండ చరియలు విరిగిపడ్డాయని వదంతులు వినిపించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 162 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు.

మహారాష్ట్రలోని మందరా దేవి ఆలయంలో..

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మందరా దేవి ఆలయంలో 2005 జనవరి 25న జరిగిన తొక్కిసలాటలో 340 మంది కన్నుమూశారు. వందల మంది గాయపడ్డారు.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్త కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా 2003 ఆగస్టు 27న జరిగిన తొక్కిసలాటలో 39 మంది కన్నుమూశారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారు.