Homeజాతీయ వార్తలుSaalumarada Thimmakka: సాలు మరద తిమ్మక్క: 114వ ఏట గతించినా.. ఈ 8,000 చెట్లు నిత్యం...

Saalumarada Thimmakka: సాలు మరద తిమ్మక్క: 114వ ఏట గతించినా.. ఈ 8,000 చెట్లు నిత్యం ఆమెను స్మరిస్తూనే ఉంటాయి!

Saalumarada Thimmakka: కొందరు సాధారణంగానే పుడతారు.. సాధారణ మనుషులుగానే ఉంటారు. కాని వారు అసాధారణమైన పనులు చేస్తారు. కారణజన్ములుగా ఎదుగుతారు. వారు చేసే పనులు గొప్పగా ఉంటాయి.. లోక కళ్యాణానికి ఊతం ఇస్తాయి. వారు చేసిన పని చిన్నదే కావచ్చు. దాని ప్రభావం సమాజం మీద తీవ్రంగా ఉంటుంది.. ఒకరకంగా చెప్పాలంటే సమాజ గతిని పూర్తిగా మార్చేస్తుంది.. అటువంటి పనినే చేశారు సాలు మరద తిమ్మక్క.

తిమ్మక్క స్వస్థలం కర్ణాటక. ఈమెను అక్కడ వృక్షాల తల్లి అని పిలుస్తుంటారు.. 114 సంవత్సరాల వయసులో ఆమె కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో నవంబర్ 14న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.. తిమ్మక్క కు పిల్లలు లేరు. దీంతో తన భర్తతో కలిసి ఆమె మొక్కలను పెంచడం అలవాటుగా మార్చుకుంది.. భర్తతో కలిసి 1950లో సుమారు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో మర్రి మొక్కలను నాటింది.. అలా అలా తన జీవితంలో ఏకంగా 8 వేల మొక్కలను నాటింది. మొక్కలను నాటడం మాత్రమే కాదు వాటిని వృక్షాలుగా ఎదిగేలా కృషి చేసింది.. తద్వారా ప్రకృతికి ఎనలేని సేవను చేసింది. పిల్లలు లేరని చుట్టుపక్కల వారు గేలి చేస్తుంటే.. ఆమె ఆ బాధను మర్చిపోవడానికి మొక్కలు నాటేది. అవి ఎదుగుతుంటే సంబరపడిపోయేది. ఎదుగుతున్న మొక్కలలో తన పిల్లలను చూసుకునేది.. మొక్కలతో ముచ్చటించేది. వాటి పండ్లను.. పూలను.. పూరెమ్మలను చూసి ఆనందించేది.

తిమ్మక్క ప్రచారాన్ని కోరుకునేది కాదు. ఒక మొక్కను నాటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తామేదో ప్రకృతికి సేవ చేస్తున్నట్టు గొప్పలు పోయే వారు తిమ్మక్క నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే తిమ్మక్క ఏనాడు కూడా ప్రచారాన్ని కోరుకునేది కాదు.. తనను పది మంది గుర్తించాలని పరితపించేది కాదు.. కేవలం మొక్కలను మాత్రమే నాటేది. వాటిని కన్నబిడ్డల మాదిరిగా సంరక్షించేది. అవి ఎదుగుతుంటే సంబరపడేది. తిమ్మక్కను చేసిన హరిత సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతేకాదు ఆమె సేవలు తరతరాలు గుర్తుంచుకునే విధంగా అభినందించింది. సుప్రసిద్ధ నటుడు పవన్ కళ్యాణ్ తిమ్మక్కను కలిశారు. ఆమె చేస్తున్న హరిత సేవను చూసి ముగ్ధుడయ్యారు. తిమ్మక్క 11 సంవత్సరాలు వయసులో నవంబర్ 14న బాలల దినోత్సవం రోజు కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను నవంబర్ 15న అధికారిక లాంచనాలతో నిర్వహించారు. తిమ్మక్క మూడు అక్షరాల పేరు మాత్రమే కావచ్చు. కానీ ఆమె నాటిన మొక్కలు 8000.

ఆమెకు పిల్లలు లేకపోయినప్పటికీ.. వారసత్వం దూరమైనప్పటికీ..ఆ చెట్లే ఆమె పిల్లలు.. ఆమె గతించిపోయినప్పటికీ ఆ చెట్లే నిత్యం పలకరిస్తుంటాయి.. తిమ్మక్క అని నోరారా పిలుస్తూ ఉంటాయి. ఒక మనిషికి ఇంతకంటే గొప్ప గౌరవం.. ఇంతకంటే గొప్ప ఖ్యాతి ఏముంటుంది. పూర్వం చరిత్ర పుస్తకాల్లో అశోకుడు మొక్కలు నాటించెను అని చదువుకున్నాం.. తిమ్మక్క చేసిన సేవను స్వయంగా చూస్తున్నాం..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version