Minister Errabelli Dayakar Rao: కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే ఏకైక ఎజెండాగా టీఆర్‌ఎస్‌ను పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌గా మార్చారు. దసరా రోజు పార్టీని ప్రారంభించారు. అయితే జాతీయ పార్టీ ప్రయాణం.. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురైదుగురు మినహా ఎవరూ పార్టీలో చేరలేదు. బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని ఎవరూ మందుకు రాలేదు. మరోవైపు తెలంగాణలో మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. 8 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఈనెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 25 మందిని తప్పిస్తే బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

ఆ 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత..
ప్రస్తుతం 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని ఎర్రబెల్లి అంగీకరించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మంగళవారం బీఆర్‌ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములపై తాను సొంతంగా సర్వే చేయించానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వస్తాయని.. అయితే 20 మంది సిట్టింగ్‌లను మారిస్తే 100 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. ఆరేడు జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కు.. మూడు నాలుగు జిల్లాల్లో బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు మధ్యే పోటీ ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కోట్లాడేది 10 సీట్ల కోసమేనని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్‌ఎస్‌కే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. తన సర్వేలు ఎప్పుడూ అబద్ధం కాలేదని పేర్కొన్నారు. సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని మంత్రి దయాకర్‌రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఎవరా 25 మంది..?
ఎర్రబెల్లి సర్వేలో 25 మందిపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని తేలినట్లు మంత్రి స్వయంగా ప్రకటించారు. అయితే వారి పేర్లు మాత్రం ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఆ 25 మంది ఎవరా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొంతమంది అసలు దివాకర్‌రావు గెలుస్తాడా అని ప్రశిస్తుంటే.. మరికొందరేమో.. సర్వే చేసిన సంస్థలు ఏంటి, వ్యతిరేకత ఎవరిపై ఎంత ఉంది, తాము సేఫేనా అని చర్చించుకుంటున్నారు.
అధికారం నిలబెట్టుకోవడంపైనే దృష్టి..
జాతీయ పార్టీగా మార్చినప్పటికీ గులాబీ నేతలు రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. సీఎం కేసీఆర్ నుంచి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికవారు సొంత సర్వేలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకత, సానుకూలతను ఇప్పటి నుంచే అంచనా వేసుకుంటున్నారు. బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ముఖ్యమైన మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్‌రావు సైతం రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు.

ప్రధాని కావాలనుకుంటే.. సీఎం అంటున్నారు..
జాతీయ పార్టీ ద్వారా బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి మోదీని గద్దె దించుతామని గులాబీ బాస్ కేసీఆర్ అంటున్నారు. కానీ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు మాత్రం తెలంగాణకు మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని సభలు, సమావేశాల్లో ప్రకటిస్తున్నారు. దీంతో క్యాడర్‌లోకన్ఫ్యూజన్ నెలకొంటోంది. జాతీయ పార్టీ అని, రాష్ట్రంలోనే రాజకీయం చేయడంపై గుసగుసలాడుతున్నారు. బీజేపీని ఓడించడం తమ వల్ల కాదనే మత్రులు తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటిస్తున్నారని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.
మరి ఎర్రబెల్లి సర్వేను గులాబీ బాస్ ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారు.. ఆయన సూచన మేరకు ఆ 25 మందిని మారుస్తారా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది.