Congress : రెండు సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ లో ఇప్పుడు జోష్ కనిపిస్తోంది. ఓవైపు పీసీసీ చీఫ్ గా రేవంత్ దూకుడు.. మరోవైపు కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క్ పాదయాత్రతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రలు చేస్తూ పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ నేతలు అధికారమే లక్ష్యంగా ఈసారి పట్టువదలని ‘విక్రమార్కుల్లా’ పనిచేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి నిర్వహిస్తున్న పాదయాత్ర సెంచరీ కొట్టేసింది. నిన్ననే వడదెబ్బ కొట్టి సెలైన్లు ఎక్కించుకున్న భట్టి ఈరోజు పాదయాత్ర 100రోజులు పూర్తి చేసుకున్న వేళ శక్తినంత కూడదీసుకొని పాదయాత్ర మొదలుపెట్టారు.
భట్టికి పార్టీ హైకమాండ్ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. రేవంత్ సహా సీనియర్ల ప్రోత్సాహం అందుతోంది. ఈ క్రమంలో భట్టి పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. భట్టి వైఎస్సార్ హాయంలో చీఫ్ విప్ గా.. తరువాత డిప్యూటీ స్పీకర్ గా..తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ప్రస్తుతం పార్టీని తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు…భారత్ జోడో యాత్ర స్పూర్తితో పీపుల్ మార్చ్ ప్రారంభించారు.
మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిరాటంకంగా ముందుకు సాగుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జోష్ నింపుతోంది. విక్రమార్క యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే తో సహా పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. సభల్లో పాల్గొన్నారు.
భట్టి పాదయాత్ర వంద రోజుల్లో 1150 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వందో రోజు పాదయాత్ర నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. కాంగ్రెస్ లో చేరనున్న నేతలు భట్టిని పరామర్శించారు.
రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై ఆరా తీసారు. భట్టి పాదయాత్రతో వస్తున్న స్పందన పార్టీలో చేరికలను పెంచింది. ఖమ్మం వేదికగా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. భట్టి సొంత జిల్లాలో జరిగే సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ ,ప్రియాంక తరలి వస్తున్నారు. మండుటెండలో అస్వస్థతకు గురైనా స్వల్ప విరామం మినహా.. వెనుకడుగు వేయకుండా భట్టి యాత్ర కొనసాగింది. ఈ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడం.. వడదెబ్బ తగిలినా వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్న భట్టి పట్టుదలకు మెచ్చుకోవాల్సిందే.