
TDP, YCP : ఏపీలో టీడీపీ నేతలు వేదనలో ఉన్నారు. వైసీపీ నేతలు రోదనలో ఉన్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. విపక్షంలో ఉన్నవారు ఆవేదనలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఎన్నాళ్లు? అన్నదే సమస్య. ఎన్నికలు ముగిసి ఇప్పటికి సగం కాలం పూర్తయింది. అయినా ఇంకా వేదన ఎందుకు? అన్నది ప్రశ్న. ఇక, వైసీపీ తీరు మరింత ఆశ్చర్యకరం. అధికారంలో ఉన్న పార్టీ నేతలు రోదించడమేంటీ? అన్నది ఆసక్తికర ప్రశ్న. మరి, ఈ రెండు పార్టీల నేతలు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి అసలైన కారణాలేంటీ అన్నది చూద్దాం.
అప్పటి వరకూ అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ.. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైంది. మరీ హీనంగా 23 సీట్లకు పడిపోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తూ అధినేత చంద్రబాబే స్వయంగా పలుమార్లు ప్రజాముఖంగా తన ఆవేదన ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ కోలుకున్నది లేదు. స్థానికమైనా.. చట్ట సభలకైనా.. ఎన్నిక ఎక్కడ జరిగినా తెలుగు దేశం పార్టీకి ఓటమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ దుస్థితిని మార్చేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. ఫలితం కనిపించట్లేదు.
శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దారుణ పరాజయమే ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో80 శాతం, మునిసిపల్ పోరులో 90 శాతం స్థానాలు అధికార పార్టీకే దక్కాయి. ఆ తర్వాత వచ్చిన తిరుపతి ఉప ఎన్నికలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ విధంగా.. ఎదుర్కొన్న ప్రతి ఎన్నికలోనూ పరాభవమే ఎదురవుతుండడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధిష్టానం ఏం చేస్తోందో అర్థం కావట్లేదని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. పలువురు నాయకులు టీడీపీకి భవిష్యత్ లేదని నేరుగానే వ్యాఖ్యానిస్తున్నారు. తట్టాబుట్టా సర్దేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, అధికార పార్టీ పరిస్థితి చూస్తే మరోలా ఉంది. శాసన సభ ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించింది అధికారం చేపట్టింది వైసీపీ. ఇక, భవిష్యత్ మనదే అంటూ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ.. వారు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి అన్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకైతే అభివృద్ధిని పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో జీతాలకే కటకట ఏర్పడిన పరిస్థితుల్లో అభివృద్ధికి నిధులు వెచ్చించే పరిస్థితి లేదు. ఇక, గతంలో వచ్చిన పలు కంపెనీలు మూటా ముల్లె సర్దుకొని వెళ్లిపోతున్నాయి. దీంతో.. అభివృద్ధి కుంటుపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా.. ఎమ్మెల్యేలకు పనిలేకుండా పోయింది.
రహదారుల నుంచి ఇతరత్రా అభివృద్ధి పనుల వరకు ప్రజలు అడిగితే.. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. పోనీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న సంక్షేమంలోనైనా తమ మార్కు చూపించుకుందామంటే అదీ లేదు. వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్.. వారికే ప్రాధాన్యమిస్తున్నారనే అభిప్రాయం ఉంది. సంక్షేమంలో ఎవరికైనా సమస్య ఉంటే.. కొత్తగా లబ్ధిదారులకు అవకాశం కావాలంటే.. వలంటీర్లకు చెప్పుకుంటే సరిపోతుంది. ఇక, పథకాల లబ్ధి నేరుగా అకౌంట్లలోనే పడిపోతోంది. దీంతో.. తాము ఏ పనీలేకుండా ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయామని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.
మంత్రుల పరిస్థితి కూడా ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదని అంటున్నారు. కేబినెట్లో పాతిక మంది మంత్రులు ఉంటే.. ఇద్దరు ముగ్గురు మినహా చాలా మంది పేర్లు కూడా జనాలకు తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు. మరికొందరి శాఖలు కూడా తెలియట్లేదు. ముఖ్యమంత్రే వన్ మేన్ ఆర్మీలా నడిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఏమైనా సర్కారు విషయాలు వెల్లడించాలంటే.. మీడియా ముందుకు సలహాదారు సజ్జల మాత్రమే వచ్చి కూర్చుంటున్నారని అంటున్నారు. ఈ విధంగా.. అటు విపక్ష నేతలు వేదన పడుతుంటే.. ఇటు అధికార పార్టీ నేతలు రోదిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.