
Narendra Modi : బీజేపీ రాజకీయాలన్నీ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా చుట్టూనే తిరుగుతున్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మరో మెట్టు ఎక్కినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. ఆ పార్టీకి సంబంధించి దేశంలో ఎక్కడైనా ఏదైనా మంచి జరిగితే క్రెడిట్ మొత్తం మోడీకి కట్టబెట్టడం.. ఏదైనా తేడా వస్తే మాత్రం స్థానిక నాయకులు తీసుకోవాలనే పరిస్థితి కొనసాగుతోందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పార్టీలో అనధికారికంగా ఈ విషయం కొనసాగుతోందని అంటున్నారు. తాజాగా.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తొలగింపుతో మరోసారి ఈ అంశం చర్చలోకి వచ్చింది.
దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ పాలన కొనసాగుతోంది. అయితే.. ఆ పార్టీ పాలనకు ఎక్కడైనా మంచి మార్కులు పడితే.. అదంతా మోడీ అకౌంట్లోకి వెళ్లిపోయేలా, ఫెయిలైతే మాత్రం అక్కడి ముఖ్యమంత్రులు, నేతల ఖాతాల్లో పడేలా సెట్ చేశారని అంటున్నారు. బీజేపీ నేతలు ఈ విధానానికి అలవాటు పడిపోయారని కూడా అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ మంచి జరిగినా.. మోడీ పాలన అనేస్తూ.. పొరపాట్లు జరిగితే మాత్రం క్షేత్రస్థాయి నేతల మెడకు బిగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గడిచిన ఆరు నెలల్లో ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులను మార్చేసింది బీజేపీ అధిష్టానం. అసోం ముఖ్యమంత్రిగా ఉన్న సోనోవాల్ ను.. ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన రావత్ ను.. కర్నాటకలో యడ్యూరప్ప, ఇప్పుడు గుజరాత్ లో రూపానీని వరుసగా పక్కన పెట్టింది అధిష్టానం. వీరిని పక్కనపెట్టడానికి ప్రజాభిప్రాయమే కారణమని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. అయితే.. దీనికి వెంటనే ఎదరు ప్రశ్న వచ్చి నలబడుతోంది.
రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వట్లేదనే అపవాదు ఉంది. కేంద్ర పెద్దల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే బీజేపీ ముఖ్యమంత్రులు పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు. తాజాగా గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసిన రావత్ ఇదే విషయాన్ని చెప్పారు. తాను మోడీ విధేయతగానే పనిచేసినట్టు చెప్పారు. అంటే.. పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ గైడ్ లైన్స్ ను ఫాలో అయ్యానని చెబుతున్నారు. మరి, అప్పుడు పొరపాటు రూపానీది ఎలా అవుతుంది? అనే చర్చ వస్తోంది.
మంచి జరిగితే మోడీకి ఆపాదిస్తూ.. తేడా వస్తే మాత్రం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులపై వేటు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఈ విమర్శపై బీజేపీ నేతలు, కేంద్రంలోని పెద్దలు ఏమంటారో..?