
Tirumala Darshan: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని ఏడాదికి ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలా మంది ఉబలాట పడుతుంటారు. ఆ దేవదేవుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అయితే కరోనా లాక్ డౌన్ తో దర్శనాలపై ఆంక్షలు విధించింది టీటీడీ.. తీవ్రత తగ్గడంతో కేవలం కొన్ని వేల మందికే దర్శనం చేయిస్తోంది.
అయితే తాజాగా కరోనా తీవ్రత తగ్గడంతో టీటీడీ భక్తులకు శుభవార్తను అందించింది. ఈరోజు నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలకు అనుమతి ఇస్తూ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు 2వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను కేటాయించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనుండగా.. త్వరలోనే మిగతా జిల్లాల వారికి కూడా టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది.
ఇప్పటికే కరోనా కారణంగా 6 నెలల నుంచి సర్వదర్శనాలను టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లు ఉన్న వారిని.. సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తూ వస్తోంది.
కరోనా తగ్గినా ఇంకా భక్తులను అనుమతించని టీటీడీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈరోజు నుంచి చిత్తూరు జిల్లా వాసులకు సర్వదర్శనం వీలు కల్పిస్తూ టీటీడీ నిర్ణయించింది. తాజాగా రోజు 2వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను విడుదల చేసింది.