సుగాలి ప్రీతీకి న్యాయం చేయాలనీ ఎప్పటినుంచో తన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి తమ బాధ వెళ్లబుచ్చుకున్నారు. పవన్ దీని విషయమై స్పందిస్తూ…ఈ రోజు కర్నూలులో బహిరంగ ర్యాలీ చేయటానికి నిర్ణయించారు. అయితే పవన్ ర్యాలీకి రాయలసీమ విద్యార్థి జేఏసీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
సుగాలి ప్రీతీ న్యాయ పోరాటంలో విద్యార్థులదే కీలక పాత్రా అంటూ.. పవన్ ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ..జేఏసీ నాయకులు తమ వాదనను వినిపించారు. గతంలో రాయలసీమ వాసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి..ఇప్పుడు ఏ మొహంతో పవన్ కర్నూలుకు వస్తున్నాడని వారు ప్రశ్నించారు. 2017లో ఈ ఘటన చోటుచేసుకుంటే..పవన్ అప్పుడు కనీసం స్పందించకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.
అయితే ఈ విషయం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణం పవన్ అనే చెప్పుకోవాలి. మూడు సంవత్సరాలుగా మరుగున పడిన చిన్నారి ప్రీతీ కేసు…ఇప్పుడు ప్రజల నోట్లో నానుతుందంటే జనసేన కృషి ఎంతోకొంత ఉందనే చెప్పాలి. మరోవైపు అధికార వైసీపీ కూడా ఈ విషయంపై సానుకూలంగానే స్పందించి..విచారణని పునరుధ్రీకరించారు. ఈ కేసును ఇప్పుడు సిబిఐకి కూడా అప్పగించబోతున్నారనే కధనాలు కూడా ప్రసారం అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో పవన్ పర్యటనని ఎలా అయిన నిలువరించే తీరతామని జేఏసీ నాయకులు వెల్లడించారు. కానీ జనసేన నాయకులు మాత్రం అనుకున్నట్టుగానే పవన్ కార్యాచరణ ఉంటుందని తెలియజేసారు. ఈ రోజు జరగబోయే పవన్ కర్నూలు పర్యటన ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.