‘నమస్తే తెలంగాణ’పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

తమ ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపి విమర్శలు కురిపించే మీడియా సంస్థలు, పాత్రికేయులపై తీవ్ర అసహనం ప్రకటిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడంలో పేరొందిన పార్టీ అధినేతల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగరం ఎంపీ బండి సంజయ్ కుమార్ సహితం మీడియాపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. లాక్ డౌన్ అమలుకు సంబంధించి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శక సూత్రాలతో లాక్ డౌన్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిన్నట్లు అవుతుందనే అర్ధంతో `లాక్ డౌన్ […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 1:56 pm
Follow us on


తమ ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపి విమర్శలు కురిపించే మీడియా సంస్థలు, పాత్రికేయులపై తీవ్ర అసహనం ప్రకటిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడంలో పేరొందిన పార్టీ అధినేతల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగరం ఎంపీ బండి సంజయ్ కుమార్ సహితం మీడియాపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.

లాక్ డౌన్ అమలుకు సంబంధించి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శక సూత్రాలతో లాక్ డౌన్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిన్నట్లు అవుతుందనే అర్ధంతో `లాక్ డౌన్ బ్రేక్’ అంటూ `నమస్తే తెలంగాణ’ ప్రముఖంగా ప్రచురించిన వార్తాకథనం పట్ల సంజయ్ నిప్పులు చెరిగారు.

`అసత్య ఆరోపణతో ఈ వార్తను ప్రచురించటం సిగ్గుమాలిన చర్య’ అంటూ సంజయ్ మండిపడ్డారు. *కరోనా కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వాలకు సహకరిస్తున్న తరుణంలో ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేయడం అనైతిక చర్య* అంటూ ధ్వజమెత్తారు.

*టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి అనేక తప్పిదాలు చేసిన ఈ సమయంలో రాజకీయాలు తగవని ఓపికతో సలహాలు, సూచనలు చేసి ఉరుకున్నాం* అంటూ హెచ్చరిక చేస్తూ నైతిక విలువలను కాపాడాల్సిన మీడియా బాధ్యత యుతంగా వ్యవహరించాలని హితవు చెప్పారు.

ఇలా కేంద్ర ప్రభుత్వం పై విషం చిమ్మి రాజకీయ పబ్బం గడపాలని చుస్తే ఊరుకునేది లేదని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు. మీడియాను బెదిరించే ధోరణి కేసీఆర్ దే అంటూ పిపిఈ కిట్స్ లేవు అని వార్త రాస్తే కేసులు పెడతా అని బెదిరించిన సీఎం కేసీఆర్ కు లాక్ బ్రేక్ వార్త కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

అధికార పార్టీ అండదండలతో నడిచే పత్రికలో ఇలాంటి వార్తలు వస్తే ప్రజలు రేపు నిజంగా బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ బ్రేక్ అని హెడ్ లైన్ పెట్టి వార్త రాసిన నమస్తే తెలంగాణ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వనికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నమస్తే తెలంగాణ యాజమాన్యంపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, చట్టబద్ధంగా ఫిర్యాదు చేస్తామని సంజయ్ హెచ్చరించారు. *మేము ఇప్పటి వరకు సహనంతో సమాజ శ్రేయస్సు కోసం ఓపికతో రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసిన సహకరిస్తూ వచ్చాం* అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.