‘‘17 అయిపోతే ఫ్రీ అయిపోతాం.. ఆ తర్వాత పార్టీ లేదు బొక్కాలేదు” అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడినట్లుగా వైరల్ అయిన వీడియో ఇప్పుడు పెద్ద దూమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి అయి ఉండి.. తన పార్టీ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అందరూ నోరెళ్లబెట్టారు. అయితే.. ఈ వీడియోలో చంద్రబాబుతో పాటు లోకేష్ పేర్లను కూడా ప్రస్తావించినట్లుగా వెలుగుచూశాయి.
ఇదిలా ఉండగా.. ఈ వీడియోను ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేసింది. ఏకంగా తిరుపతి ఉప ఎన్నికకు లింక్ పెడుతూ ట్వీట్ చేసింది. ‘‘తెలంగాణలో దుకాణం సర్దేసిన టీడీపీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దివాళ తీయనుంది. రేపు ఉంటుందో లేదో తెలియని టీడీపీకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వృథా చేసుకోకండి తమ్ముళ్లు’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. టీడీపీకి ఓటు వేసి ఓటు హక్కును వృథా చేసుకోవద్దంటూ పేర్కొన్నారు.
ఇక.. ఈ వీడియోపై తాజాగా అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా జగన్ సొంత మీడియా సాక్షిపై పెద్ద స్థాయిలో విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని దుయ్యబట్టారు. బుధవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ‘‘నువ్వూ.. నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీ విభేదాలు సృష్టించలేవు జగన్ రెడ్డి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్‌కు తోకముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లు వేయించావు. ఈ రోజు నా సంభాషణలను వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు’’ అని చెప్పుకొచ్చారు.
మొత్తంగా అచ్చెన్నాయుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఉప ఎన్నికలో హాట్ టాపిక్‌గా మారింది. అటు బీజేపీ సైతం అదే టాపిక్‌ను లేవనెత్తుతోంది. సొంత పార్టీలోనే అసంతృప్తులు ఉన్నారని.. ఇక టీడీపీ బిచాన ఎత్తేయడం ఖాయమని వాపోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఆ పార్టీ మీద నమ్మకం పోయిందని.. ఇక మిగితా క్యాడర్ ఎలా నమ్ముతుందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.