ష‌ర్మిల పార్టీలోకి గులాబీ కీల‌క నేత‌?

తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వ‌డంతో.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక ర‌క‌మైన అల‌ర్ట్ వ‌చ్చింది. జ‌నాలకు ఇదో ఛేంజోవ‌ర్ లా అనిపిస్తోంది. దీంతో చూద్దాం అన్న‌ట్టుగా ఉన్నారు. అయితే.. రాజ‌కీయంగా ప్రాధాన్యం లేని నేత‌లు, పొలిటికల్ కెరీర్ ఫేడ్ ఔట్ అయిపోన నాయ‌కులు ఆమె ప‌క్క‌న చేరేందుకు చూస్తున్నారు. కాగా.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన గులాబీ నేత‌గా ఉన్న మాజీ ప్ర‌జాప్ర‌తినిధి.. ష‌ర్మిల గూటికి చేర‌బోతున్నార‌న్న వార్త సంచ‌ల‌నంగా మారింది. ఏపీకి చెందిన నేత‌లు.. త‌మ‌పై […]

Written By: Bhaskar, Updated On : April 25, 2021 11:05 am
Follow us on


తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వ‌డంతో.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక ర‌క‌మైన అల‌ర్ట్ వ‌చ్చింది. జ‌నాలకు ఇదో ఛేంజోవ‌ర్ లా అనిపిస్తోంది. దీంతో చూద్దాం అన్న‌ట్టుగా ఉన్నారు. అయితే.. రాజ‌కీయంగా ప్రాధాన్యం లేని నేత‌లు, పొలిటికల్ కెరీర్ ఫేడ్ ఔట్ అయిపోన నాయ‌కులు ఆమె ప‌క్క‌న చేరేందుకు చూస్తున్నారు. కాగా.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన గులాబీ నేత‌గా ఉన్న మాజీ ప్ర‌జాప్ర‌తినిధి.. ష‌ర్మిల గూటికి చేర‌బోతున్నార‌న్న వార్త సంచ‌ల‌నంగా మారింది.

ఏపీకి చెందిన నేత‌లు.. త‌మ‌పై రెండు రాష్ట్రాల దృష్టి ప‌డాల‌ని కోరుకున్న‌ప్పుడు ఎంచుకునే వేదిక ఏదైనా ఉందంటే.. అది ఖ‌మ్మం మాత్రమే. అందుకే.. ష‌ర్మిల కూడా తొలి స‌మావేశానికి ఖ‌మ్మాన్ని ఎంచుకున్నారు. ఇక‌, తెలంగాణ‌లో వైసీపీ జెండా క‌నుమ‌రుగైపోయే నాటికి కూడా ఆ పార్టీ ప్ర‌భావం అంతో ఇంతో కనిపించింది ఖ‌మ్మం జిల్లాల్లోనే. వైఎస్ హ‌యాంలోనూ ఖ‌మ్మంలో కాంగ్రెస్ హ‌వా బాగా సాగింది. ఈ లెక్క‌ల‌న్నీ వేసుకొని, ఖ‌మ్మాన్ని సెల‌క్ట్ చేసుకున్నారనే ప్ర‌చారం ఉంది.

ఇక‌, ష‌ర్మిల పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇటు ఖ‌మ్మం, అటు న‌ల్గొండ జిల్లా నేత‌ల‌తోనే ఆమె కీల‌క‌ స‌మావేశాలు నిర్వ‌హించారు. లోట‌స్ పాండ్ హ‌డావిడి త‌ర్వాత‌.. అంతో ఇంతో స్పంద‌న క‌నిపించింది కూడా ఆ రెండు జిల్లాల్లోనే క‌నిపించింది. ఖమ్మం హడావిడికి పైన చెప్పుకున్నవి కార‌ణాలు కాగా.. న‌ల్గొండ‌లో రెడ్ల ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ ఇత‌ర పార్టీల్లో ప్రాధాన్యం ల‌భించ‌ని నేత‌లు షర్మిల‌వైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఖ‌మ్మంలో ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌భావం కొన‌సాగుతూ ఉంటుంది. పాలేరు వంటి చోట్ల రెడ్డి ప్ర‌భావం ఉంటుంది. ఇక్క‌డి నుంచే మాజీ మంత్రి రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి స‌త్తా చూపేవారు. దీంతో.. ష‌ర్మిల సేఫ్ జోన్ గా ఖ‌మ్మం జిల్లాను ఎంచుకొని, పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించేశారు. ఇప్పుడు ష‌ర్మిల పార్టీలోకి రావాల‌ని చూస్తున్నార‌నే నేత కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేతే కావ‌డం గ‌మ‌నార్హం.

ఖ‌మ్మం టీఆర్ఎస్ లో ప్ర‌ధానంగా నాలుగు గ్రూపులు కొన‌సాగుతున్నాయి. అందులో ముగ్గురు ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. అయితే.. గ‌త సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ముందు‌ సిట్టింగ్ ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న ఆ నేత‌కు.. తిరిగి సీటు ఇవ్వ‌లేదు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ రాష్ట్రం మొత్తం స‌త్తా చాటినా.. ఉమ్మ‌డి ఖ‌మ్మంలో దారుణంగా ఓడిపోయింది. ఒకే ఒక‌స్థానం ద‌క్కించుకుంది. అప్ప‌టి మంత్రి కూడా ఓడిపోయారు. దీనివెనుక ఈ నేత ఉన్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తోనే.. ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌లేదు అధిష్టానం.

ఫ‌లితంగా.. బ‌ల‌మైన క్యాడ‌ర్ ఆయ‌న వెంట ఉన్నా పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇప్పుడు.. ఓ మంత్రి ఆయ‌న‌ను ఎద‌గ‌కుండా తొక్కేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఈ కార‌ణాల‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని, ఆయ‌న ష‌ర్మిల పార్టీలోకి వెళ్ల‌బోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.