మొన్నటికి మొన్న సంగం డెయిరీలో అక్రమాలు అంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి ఆయన వాయిస్ కట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా మరో టీడీపీ నేతపై పడింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు జగన్ సర్కార్ షాకిచ్చింది.
తాజాగా విశాఖపట్నం కార్పొరేషన్ సిబ్బంది నిన్న అర్ధరాత్రి దాటాక పల్లా శ్రీనివాస్ కు చెందిన భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చేశారు. దీంతో విశాఖపట్నం, గాజువాకల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దూళిపాళ్ల ను అరెస్ట్ చేసిన రెండో రోజే మరో టీడీపీ నేతను జగన్ సర్కార్ టార్గెట్ చేయడం విశేషం.
పల్లా శ్రీనివాస్ కు చెందిన పాత గాజువాకలోని ఓ వ్యాపార సముదాయం అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని విశాఖ గ్రేట్ అధికారులు అర్థరాత్రి ఈ భవనాన్ని కూల్చివేశారు. ఈ సమాచారం అందగానే పల్లా వెంటనే అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి సమయంలో కూల్చడం ఏంటంని విశాఖ జీవీఎంసీ అధికారులను నిలదీశారు. టీడీపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా నిబంధనల ప్రకారమే భవన నిర్మాణం చేపట్టారని.. దీనికోసం ముందు రోడ్డు కోసం కూడా స్థలం వదిలేసినట్లు పల్లా తెలిూపారు. గత ఏడాది జూలైలోనే ఆ భవన నిర్మాణానికి అనుమతులు పొందామని పల్లా శ్రీనివాస్ తెలిపారు.