పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట..!

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’ నెట్టిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని, వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు. మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు. గతంలో సీఎం ‘కరోనా వస్తుంది, పోతుంది… పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’ […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 12:12 pm
Follow us on


రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’ నెట్టిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని, వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు.

మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు. గతంలో సీఎం ‘కరోనా వస్తుంది, పోతుంది… పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని… ఇప్పుడు ‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసు కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు.

రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనలేదని విమర్శించారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని చెప్పుకొచ్చారు.

బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు టీడీపీ అండగా ఉందని పేర్కొన్నారు. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు వైసీపీ నేతలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతమైందని తెలిపారు. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతల ధోరణి ఉంది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాలంటీర్ల వేతనాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చౌకడిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టారని.. కరోనా వైరస్ వ్యాప్తికి ఇది మరో కారణమన్నారు. లాక్‌డౌన్‌లోనూ యధేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. హెల్త్ బులెటిన్లను ఫార్స్‌గా మార్చారని వ్యాఖ్యానించారు. కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరోనా టెస్టింగ్‌లను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో పెను విషాదంగా మారిందన్నారు. నాసిరకం పీపీఈలతో కరోనా వైద్య సిబ్బంది‌ని వైరస్‌పై యుద్ధానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే అని ఆయన అన్నారు.

వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం, వారిలో నలుగురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులకు రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ద ప్రజారోగ్యంపై లేదన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల ప్రధానాధికారిని తొలగించడం, హుటాహుటిన చెన్నై నుంచి మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం, ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునివ్వడం, వైసీపీ నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ చూసే పొరుగు రాష్ట్రాలు సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారన్నారు. తనను నిందించినా, టీడీపీని దూషించినా ప్రజల కోసం భరిస్తామని కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని భరించలేమని స్పష్టం చేశారు.

విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేదన్నారు. వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా టెస్టింగ్‌లపై లేదన్నారు. మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి అంటూ ప్రజలను ఆయన కోరారు.