గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై కరోనా పేషంట్ బంధువులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం రాత్రి జూడాలు మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. గత రెండ్రోజులుగా గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్, సీనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. బుధవారం ఆస్పతి ఎదుట వైద్యులంతా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు.
కోవిడ్-19 వైద్యసేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం గాంధీ ఆస్పత్రి వచ్చి చర్చించాలని జూడాలు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈనేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకొని వారికి చర్చలు ఆహ్వానించారు. తాము సీఎంతో చర్చిస్తామని జూడాలు భీష్మించారు. అనంతరం ఈటల రాజేందర్ జూడాలు చర్చించారు. ఈమేరకు తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు శాంతించారు.
కోవిడ్-19 లక్షణాలు లేని రోగులకు ఆయా జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనే చికిత్స అందించాలని జూడాల సంఘం డిమాండ్ చేసింది. కరోనా పాజిటివ్ కేసులన్నీ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేయడంతో వైద్యులపై అధిక భారం పడుతుందన్నారు. వైద్యులు ఒత్తిడి లోనుకుండా మరో ఆస్పత్రి అన్ని జిల్లాల్లో కోవిడ్ సేవలను అందించాలని కోరారు. వైద్యులపై ఒత్తిడి లేకుండా అదనంగా 30శాతం సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. వైద్యులు, నర్సులు, శానిటేషన్ వర్కర్లను నియమించాలని వెంటనే నియమించి అదనపు సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. హెల్త్ వర్కర్లకు సరిపడా పీపీఈ కిట్లు అందేలా చూడాలన్నారు. తాము సూచించిన పీపీఈ కిట్లనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచించారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జూడాల డిమాండ్లపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే 15రోజుల్లో తమ డిమాండ్ల ప్రభుత్వం పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేశారు. ఈ 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మరోసారి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్ సంఘం హెచ్చరించారు. మంత్రి ఈటల రాజేందర్ జూనియర్ డాక్టర్లతో రెండుసార్లు చర్చించిన అనంతరం జూడాలు సమ్మెను విరమిస్తున్న ప్రకటించారు. తక్షణమే తాము విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కోవిడ్-19రోగులు, వారి బంధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.