ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే పరిశ్రమను రాష్ర్టం దాటి వెళ్లిపోవాల్సిందిగా వైసీపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. టీడీపీ నేత గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థను మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం వల్ల ప్రజల ప్రాణాలకు కష్టంగా ఉందని పేర్కొంది. దీనిపై హైకోర్టు కూడా వెళ్లిపోవాలని సూచించిందని చెప్పింది. దీంతో అమరరాజా బ్యాటరీస్ సంస్థ రాష్ర్టం నుంచి వెళ్లిపోవడం లేదని తామే బయటకు పంపుతున్నట్లు తెలిపింది. ప్రజలకు ఇబ్బందిగా ఉంటే దేన్ని అయినా తొలగించాల్సిందేనని చెప్పింది. దీంతో అమరరాజా సంస్థ మనుగడ కష్టంగా మారింది.
ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. విరుద్ధంగా పరిశ్రమలు నడుపుతున్న వాటిని మూసేయాలని సూచించింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మనుషుల ప్రాణాలకే విలువ ఇవ్వాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తమకు అమరరాజా పై కోపం లేదని ప్రజల ప్రాణాలు హరించే పరిస్థితి వచ్చినందుకే సంస్థను రాష్ట్రం బయటికి పంపుతున్నట్లు పేర్కొన్నారు.
అమరరాజా బ్యాటరీస్ సంస్థలో 55 మందికి పరీక్షలు చేయగా 41 మంది శరీరాల్లో సీసం ఉన్నట్లు గుర్తించారు. అమరరాజాయే కాదు వైవీ సుబ్బారెడ్డి సంస్థ ఉన్నాప్రభుత్వం అలాగే వ్యవహరిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. గల్లా రామచంద్రనాయుడు, గల్లా జయదేవ్ టీడీపీ వారని, అమరరాజా సంస్థలో అక్రమాలు, తప్పులున్నా ప్రభుత్వం ప్రశ్నించవద్దా అని సజ్జల అడుగుతున్నారు. కాలుష్యంపై పీసీబీ, హైకోర్టు నిర్ధారించినందు వల్లే తాము చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అమరరాజా బ్యాటరీస్ సంస్థ మనుగడపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అది మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమలను ఉపేక్షించేది లేదని వైసీపీ నేతుల చెబుతున్నారు. దీంతో కాలుష్య కారక సంస్థలు ఉండవద్దనే ఉధ్దేశంతోనే అమరరాజా సంస్థను తొలగించడం సముచితమే అనే సమాధానాలు వస్తున్నాయి. దీంతో ఏపీలో కాలుష్య కారక సంస్థల మనుగడపై అప్పుడే అనుమానాలు రేకెత్తుతున్నాయి.