World Heart Day 2023: ఇవాళ ప్రపంచ హృదయ దినోత్సవం. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గుండె జబ్బులు నివారణ పై మారథాన్ లు, అవగాహన సమావేశాలు జరుగుతున్నాయి. చాలామంది వైద్య నిపుణులు గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. వ్యాయామం చేయాలని, ఆహార సమతుల్యత పాటించాలని, జంక్ ఫుడ్ తీసుకోవద్దని, సాధ్యమైనంతవరకు మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంటే ఇవే గుండెపోటుకు ప్రధాన కారణాలు అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి గుండెపోటు సంభవిస్తుంది. అసలు గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందా? లేకుంటే మన చిట్టి గుండె ఏమైనా సంకేతాలు ఇస్తుందా? ఈ కథనంలో చూద్దాం.
ఒకప్పుడు గుండెపోటు మరణాలు నగరాల్లో మాత్రమే నమోదు అయ్యేవి. పట్టణాలలో అప్పుడప్పుడు గుండెపోటు మరణాలు సంభవించేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా గుండెపోటు కేసులు విస్తరించాయి. జీవన శైలి మారడం వల్ల ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ నివేదికలో తేరింది. జాగ్రత్తలు తీసుకోవడంలో కనబరిచే నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోందని హెచ్చరించింది. ఫలితంగా ఒకప్పుడు 55 సంవత్సరాలు దాటితే గాని గుండె సంబంధిత జబ్బులు వచ్చేవి కావని, ఇప్పుడు 18 సంవత్సరాల యువకుల నుంచి గుండెపోటు మరణాలు నమోదు అవుతున్నాయని వాపోయింది. వాస్తవానికి దేశంలో నమోదయ్యే గుండెపోటు మరణాలను ఇండియన్ కార్డియాలజీ అసోసియేషన్ సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తోంది. గుండెపోటుకు మధుమేహం, రక్త వంటి దీర్ఘకాలిక సమస్యలు తోడు కావడంతో మరణాలు ఆకస్మికంగా చోటు చేసుకుంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొగాకు, ఆల్కహాల్ విపరీతంగా తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మోతాదుకు మించి ఇవి తీసుకుంటే వాటి తాలూకూ ఉద్గారాలు గుండెపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. గుండె అంత ఒత్తిడి తట్టుకోలేదు కాబట్టి ఆ ప్రభావాన్ని నేరుగా చూపిస్తుంది. కుడి చెయ్యి తీవ్రంగా లాగడం, కడుపులో మంట అనిపించడం, వీపు వెనుక భాగం నొప్పిగా ఉండడం, అడుగు తీసి అడుగు వేయలేనంత ఆయాసం రావడం వంటి లక్షణాలు గుండెపోటుకు సంబంధించినవే. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండెపోటు అని భావించాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. రక్తపోటు అదుపులో లేకపోవడం, చెడు కొవ్వు రక్తనాళాల్లో పేరుకుపోవడం, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ట్రై గ్లిజరాయిడ్స్ ఉండడం, వయసుకు, ఎత్తుకు మించిన బరువు ఉండడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోకపోవడం, జన్యుపరమైన కారణాలు గుండెపోటు మరణాలకు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 40 నిమిషాల తగ్గకుండా వ్యాయామం చేయడం, కొవ్వు ఉన్న ఆహారం తగ్గించి పీచు ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటును రాకుండా అడ్డుకోవచ్చు. 35 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2d ఏకో తీయించుకోవడం మంచిది. చెడు కొలెస్ట్రాల్ గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం, బిపి, అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే రోజు 40 నిమిషాల పాటు నడక లేదా జాగింగ్ లేదా స్విమ్మింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ అసలు తీసుకోవద్దని, రోజుకు మూడు గ్రాములకు మించి ఉప్పు వినియోగించద్దని, నెలకు 500 మిల్లీమీటర్లకు మించి ఆయిల్ వాడకూడదని చెబుతున్నారు. పదేపదే మరిగించిన నూనెతో చేసిన ఆహార ఉత్పత్తులను తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.