Homeప్రత్యేకంConjunctivitis: కళ్ల కలకలు కమ్మేస్తున్నాయి.. ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది?

Conjunctivitis: కళ్ల కలకలు కమ్మేస్తున్నాయి.. ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది?

Conjunctivitis: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు ‘ఐ ఫ్లూ’(కళ్ల కలకలు)తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ‘ఐ ఫ్లూ’ను వైద్య పరిభాషలో కంజంక్టివైటిస్‌ అంటారు. వాడుక భాషలో కళ్ల కలకలు అంటుంటారు. ఐ ఫ్లూ సోకిన వారి కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. గులాబీ రంగులోకి మారడం వల్ల ‘పింక్‌ ఐ’ అని కూడా అంటారు. కళ్లలో మంట, కంటి నుంచి నీరు కారడం, నిద్ర లేచేసరికి రెప్పలు అతుక్కోవడం, కళ్లలో పుసి ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అసలు ఎందుకు వస్తాయి?
ఇది ఒక రకమైన ఇన్‌ఫెక్షన్‌. ఒక్కోసారి జలుబుకు కారణమైన వైరస్‌ వల్ల కూడా కళ్ల కలకలు వస్తుంటాయి. వైరస్, బ్యాక్టీరియా, అలర్జీల వల్ల కళ్ల కలకలు వస్తుంటాయని అమెరికాలోని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’(సీడీసీ) చెప్తోంది. ఒక్కోసారి కంట్లో ఏవైనా రసాయనాలు పడినా, గాలి కాలుష్యం వల్ల, ఫంగస్‌ వల్ల, కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కూడా కలకలు వస్తాయని సీడీసీ చెప్తోంది.

ఎలా వ్యాపిస్తుంది..
బాక్టీరియా, వైరస్‌ వల్ల వచ్చే ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అలర్జీల కారణంగా వచ్చిందైతే వ్యాపించదు. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఐ ఫ్లూ లేదా వైరల్‌ ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఐఫ్లూతో బాధపడుతున్నవారి కళ్లలోకి చూసినా వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.. సాధారణంగా అలాంటి ప్రమాదం ఉండదు. బాగా దగ్గరగా వెళ్లినప్పుడు, ఇతర రకాలుగా వ్యాపించే అవకాశం ఉంటుంది.

వర్షాకాలంలోనే ఎక్కువ..
ఐ ఫ్లూ ఎక్కువగా వర్షాకాలంలో వ్యాపిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాపించే అవకాశం, మనగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వ్యాప్తి కారకాలు..
– ఐఫ్లూతో బాధపడేవారు కళ్లలో మంట కారణంగా, నీళ్లు కారడం వల్ల కళ్లు తుడుచుకుని ఆ చేతులతో ఏవైనా వస్తువులను పట్టుకుంటే.. వాటిని మళ్లీ పట్టుకున్నవారికి వైరస్‌ వ్యాపిస్తుంది.

– అలాగే, ఐ ఫ్లూ ఉన్నవారికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు, ముఖం ముఖం తాకినప్పుడు కూడా వైరస్‌ సోకే అవకాశం ఉంటుంది.

– ఐ ఫ్లూ ఉన్నవారు ఉపయోగించిన టవళ్లు, రుమాళ్లు ఇతరులు వాడినా వైరస్‌ వ్యాపిస్తుంది.

ఎలా గుర్తించాలి?
కళ్లు ఎరుపెక్కడం, నీరు కారడం, దురదగా ఉండటం, కంటి రెప్పలు అంటుకుపోవడం వంటివి కళ్లకలక ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే కళ్ల కలకలు వచ్చాయని అర్థం. అయితే కొన్ని రకాల ఐ ఇన్‌ఫెక్షన్లలో కూడా కంటి రెప్పలు అంటుకుంటుంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

– మీ ఇంట్లో ఎవరికైన కళ్లు ఎర్రగా కనిపిస్తే వారి నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు ఒక గదిలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వీలయినంత వరకు కంటికి ఇబ్బంది కలిగించే పనులు చేయకపోవడమే ఉత్తమం..!

– కళ్లకలకలు వచ్చిన వారి కళ్లను చూడకూడదు. కళ్లలోకి చూడడం, వారి కళ్లు ఎలా ఉన్నాయాని పరిశీలన చేయొద్దు.

– వీలయితే పవర్‌ లేని కళ్లజోడు వాడే ప్రయత్నం చేయండి. ఎవరైనా కాంటాక్ట్‌ లెన్సులు వాడేవారు వాడకండి.

– చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ఎవరైనా కళ్లకలకలు ఉన్నవారిని తాకకండి. ఒకవేళ కళ్లు ఎర్రగా మారితే వాటిని చేయితో నలిపే ప్రయత్నం చేయరాదు.

– కళ్లు ఇలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకండి.

– పూర్తి విశ్రాంతితో ఉండండి. ఫోన్లు, టీవీలు చూడవద్దు.

– డాక్టర్‌ను కలిసి మందులు, కళ్లకు చుక్కల మందులు తీసుకుని గంటకు ఓసారి వేసుకోండి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular