
ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2021 జనవరి నాటికి కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పలు దేశాల్లో కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో డబ్ల్యూహెచ్ఓ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ప్రపంచ దేశాల ప్రజలను డబ్ల్యూహెచ్ఓ మరోసారి హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కరోనా మహమ్మారి వల్ల సమస్యలు ఎదుర్కోక తప్పదని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నోమ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రస్తుతం కీలక మలుపులో ఉందని.. పలు దేశాలు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ఉత్తరార్థ గోళంలోని దేశాలు మహమ్మారి వల్ల సమస్యలు తప్పవని పేర్కొన్నారు.
ఆరోగ్య, విద్యా వ్యవస్థలు కుప్పకూలిపోకుండా దేశాధినేతలు చర్యలు తెలుసుకోవాలని.. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని.. కరోనా విజృంభించిన తొలినాళ్లలో తాను ఇదే విషయం చెప్పానని మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచి, కరోనా సోకిన వాళ్లు ఐసోలేషన్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితుల నుంచి రక్షించుకోవచ్చని అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో కట్టడి చేసే వ్యాక్సిన్ జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నానని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడం ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఆరోగ్యవంతులైన వారి దగ్గరకు వ్యాక్సిన్ రావడానికి ఆలస్యమవుతుందని వెల్లడించారు.